హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్ – 2025’ను అధికారికంగా విడుదల చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ జీవో 252 జారీచేస్తూ, కొత్త నిబంధనల ప్రకారం అక్రెడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు ఫిబ్రవరి 9 నుంచి సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలను (డీఎంఏసీ) ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీకి (ఎస్ఎంఏసీ) మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షుడిగా, ఐ అండ్ పీఆర్ కమిషనర్ కో-చైర్మన్గా వ్యవహరిస్తారని, జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.