సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ‘కొంతమంది పనికిమాలినోళ్లు కేసీఆర్ కనిపిస్తలేరని అంటున్నారు.. అలాంటోళ్లు రైతుల వద్దకు వెళ్లి అడిగితే పంట పొలాలు, వడ్ల గింజల్లో కేసీఆర్‌ను చూపిస్తారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 25న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలిపారు. ఈ నెల 27న ఎల్కతుర్తి సభ తరువాత బీఆర్ఎస్లోకి వలసలు వద్దన్నా ఆగవని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.
రజతోత్సవ సభకు విరాళం
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 14: బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి, బీఆర్ఎస్ అభిమాని నరసింహాచారి దంపతులు జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి సోమవారం రూ.1,016 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రజతోత్సవ సభ వాల్‌రైటింగ్ తుడిచివేత మాజీ ఎమ్మెల్యే కంచర్ల రాసిన వాల్‌రైటింగ్‌ను చెరిపిన దుండగులునీలగిరి, ఏప్రిల్ 14 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని నల్లగొండలో రాసిన వాల్‌రైటింగ్స్‌ను కొద్దిగంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు తుడిపివేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఎన్జీ కళాశాల మైదానంలోని గోడలపై సభ విజయవంతం చేయాలని రాయగా.. కొద్ది గంటలకే గుర్తు తెలియని వ్యక్తులు చెరిపేశారు. బీఆర్ఎస్ శ్రేణులు గమనించి మున్సిపల్, ఎన్జీ కళాశాల అధికారులను సంప్రదించగా అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము సెలవులో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో తలపెట్టిన సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతున్నదని మండిపడ్డారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ జయంతి రోజునే హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
25 ఏండ్ల పండుగను విజయవంతం చేయాలి ; మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
దంతాలపల్లి/నర్సింహులపేట, ఏప్రిల్ 14: బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను విజయవంతంచేయాలని మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నర్సింహులపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అందించడంలో విఫలమైన కాంగ్రెస్ పరిస్థితిని ప్రజలకు వివరించి.. వచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పీఏసీఎస్‌లో వార్ వన్‌సైడ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే ండు మూడురోజుల్లో సీఎం మార్పు తప్పదేమో అనిపిస్తున్నదని చెప్పారు. అనంతరం సూర్యాపేట రోడ్డులో చలో వరంగల్ వాల్ రైటింగ్‌ను మాజీ ఎంపీ కవిత ప్రారంభించారు. బహిరంగ సభకు గ్రామానికి చెందిన అనిల్ 50 కేజీల బియ్యం విరాళంగా అందజేశారు.
యాదగిరిగుట్టకు పాదయాత్ర ;బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కదలిన గులాబీ సైన్యం
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14 : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి కమాన్ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ వైకుంఠ ద్వారం వద్దకు పాదయాత్ర చేపట్టారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభ విజయవంతం కావాలని స్వామివారికి మొక్కి, సీఎం రేవంత్‌కు మం చి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి ; ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
ఎల్కతుర్తి, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన చేశారని చెప్పారు.
ఎల్కతుర్తికి వేలాదిగా తరలిరావాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ఖమ్మం, ఏప్రిల్ 14 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మంజిల్లా నుంచి వేలాదిగా ప్రజలు తరలిరావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం నగరంలోని 6వ డివిజన్లో రజతోత్సవ సభకు సంబంధించిన వాల్‌రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగరాజు, రఘునాధపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్, కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మక్బుల్, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.