మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లాలోని హన్వాడ మండలం చిందార్ పల్లీ, చిర్మల్ కుచ్చా తాండా లకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీ లకు చెందిన ముఖ్య కార్యకర్తలు మంత్రి సమక్షంలో మహబూబ్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఇతర రాష్ట్రాల కు ఆదర్శంగా నిలిచిందన్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు, రైతు బీమాను అందించి అన్నదాతలకు అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
గతంలో మహబూబ్‌నగర్ ఎలా ఉంది. ఇప్పుడు ఎలా అభివృద్ధి సాధించింది అనే విషయాన్ని గమనించాలన్నారు. జిల్లాకు ఎన్నో కంపెనీలు వస్తున్నాయని, ఇక్కడే స్థానికంగా వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.