హైదదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సం గారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శితోపాటు కార్యవర్గాన్ని, కమిటీని ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. గతంలో డీవైఎఫ్ఐ, కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఎం నూతన రాష్ట్ర కార్యవర్గం 60 మందితో ఏర్పాటైంది. వీరిలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా జీ నాగయ్య, ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, టీ జ్యోతి, టీ సాగర్, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, పీ ప్రభాకర్, నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్, ఎండీ జహంగీర్‌ను మహాసభ ఎన్నుకున్నది. 70 ఏండ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి వీడ్కోలు పలికారు. దీంతో తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, డీజీ నర్సింహారావుకు రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కలేదు. వీరిని సెంట్రల్ కమిటీకి తీసుకోనున్నట్టు పార్టీ వ ర్గాలు తెలిపాయి.
తొలిసారిగా దళితులకు పదవి
దేశంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే తొలిసారిగా తెలుగు రాష్ర్టాల్లో దళిత నేతకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. ఇప్పటి వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శులుగా అగ్రవర్ణాలకు చెందిన వారే పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు నుంచి మూడుసార్లు ఆ పార్టీకి నాయకత్వం వహించిన తమ్మినేని వీరభద్రం ఈ మహాసభల్లో రిలీవ్ అయ్యా రు. దీంతో ఈసారి జాన్వెస్లీకి అవకాశం దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి లేదా సీఐటీయూ నాయకుడు ఎస్ వీరయ్య ఎన్నికవుతారని భావించారు. అయితే ఈ అంచనాలు తారుమారు చేస్తూ జాన్వెస్లీకి బాధ్యతలు అప్పగించారు.
బీజేపీని రాజకీయంగా ఎండగట్టాలి
తెలంగాణలో బీజేపీ విధానాలను రాజకీయంగా ఎండగట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సి వ్యూహంపై రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై పోరాటం చేయాలని నిర్ణయించారు.