హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత అన్ని పార్టీలు, ప్రజాసంఘాల మద్దతును సమీకరిస్తున్నారు. అందులోభాగంగా ఆమె శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని కలిసి తన పోరాటానికి సీపీఎం మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. అందువల్ల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని కోరారు. తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ అవరణలో ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో ఆమెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదన్నది సీపీఎం నమ్మకమని స్పష్టం చేశారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రప్రభుత్వాన్ని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
కార్వాన్ : బీసీల హక్కుల సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పూలే 198వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని మింట్ కాంపౌండ్, శారదానగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజహితం కోసం పనిచేసిన ఫూలేను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో అందరూ నడవాలని అన్నారు. ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించేంత వరకు ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని చెప్పారు. ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్నదని, దీనిని తాము స్వాగతిస్తున్నామని అయితే అసెంబ్లీ ఆవరణలో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్లో వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితను లక్ష్యంగా చేసుకుని బీసీ సంఘాల నాయకుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్న కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ అభ్యంతరం చెప్పారు. కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. వెంటనే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాజుల శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిచేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరగా సభాధ్యకుడు చిన్న శ్రీశైలంయాదవ్ నిరాకరించారు. స్థానిక కార్పొరేటర్‌కు మైక్ ఇవ్వకపోవడంపై కొంత గందరగోళం నెలకొంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫూలే విగ్రహాన్ని ఫిలింనగర్లో ప్రతిష్ఠించాలని కష్టపడిన తమకు కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీ సంఘాల ముసుగులో అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సభను ముగించి, నిర్వాహకులు వెళ్లిపోయారు. కాగా ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీద చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, జాగృతి కార్యకర్తలు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నేతలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాజుల శ్రీనివాస్ కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.