చిక్కడపల్లి, జూన్ 26 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లో జాన్‌వెస్లీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.
పీజీలు, పీహెచ్‌డీలు చేసి ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకొంటున్న నిరుద్యోగులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు చనిపోయారు? ఇంకెంత మంది చనిపోవాలి? అని నిలదీశారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ మోతీలాల్ నాయక్, జేఏసీ నాయకులు సుధీర్, సింధూరెడ్డి, ఖాసీం, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, జూన్ 26: తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిరుద్యోగులు నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నా చేశారా? అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని నగర గ్రంథాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్‌ను నిరుద్యోగులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికెషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారని.. ఆయన అబద్ధాలు మాట్లాడుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని రియాజ్‌ను నిలదీశారు. రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి తమకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో సమాధానం ఇవ్వని రియాజ్ తన ఆఫీసుకు వచ్చి కలువండని చెప్పి జారుకున్నారు.