హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ)/ గద్వాల: రాష్ట్ర కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. జోగులాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరగణంతో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన ప్రభాకర్‌రెడ్డికి సముచిత స్థానాన్ని కల్పించి పార్టీ గౌరవిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ను తట్టుకొని నిలబడే అభ్యర్థుల కరువుతో కాంగ్రెస్, బీజేపీలు కొట్టుమిట్టాడుతున్నాయని ఎద్దేవా చేశారు. కంటి ముందు అభివృద్ధి, ఇంటి ముందు సంక్షేమం ఇవే బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నాలుగు ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే మాటలను ప్రజలను నమ్మబోరని తెలిపారు. గద్వాలలో నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నోట్ల కట్టలకు టికెట్లు అమ్ముకొనే సంస్కృతి చూడలేక తాను కాంగ్రెస్ పార్టీని వీడానని పటేల్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గద్వాలకు ముఖ పరిచయం లేని వ్యక్తులకు రేవంత్‌రెడ్డి టికెట్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. 25 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పాదయాత్ర చేస్తే తనకు సీటు ఇవ్వకుండా ప్యారాచూట్ నాయకులుగా పార్టీలోకి వచ్చిన వారికి కేటాయించడమేమిటని ప్రశ్నించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గద్వాలలోని పటేల్ ప్రభాకర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను ఆయన అనుచరులు దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా ఎన్నికల ఇన్చార్జి రాకేశ్, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధి నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ రాష్ట్రంలో పర్యటిస్తుండగా.. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం బీఆర్ఎస్లో చేరినవారిలో గద్వాల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పూల కరుణాకర్, అలెగ్జాండర్, జనరల్ సెక్రటరీ విజయ్‌కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రఘునాయుడు, ధరూర్, కేటిదొడ్డి మండలాల అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడ్, విశ్వనాథ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమాదేవి, కౌన్సిలర్ బంగి ప్రియాంక, ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ బంగి సుదర్శన్ తదితరులు ఉన్నారు. గద్వాల జిల్లాలో అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకోవటంతో జిల్లా కాంగ్రెస్ ఖాళీ అయిందనే వాదన వినిపిస్తున్నది.