ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు మాజీ మంత్రిని శాలువాతో సన్మానించి నాగోబా ఫోటో బహూకరించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేశారు.
ఐదు రోజులపాటు అంగరంగవైభవంగా సాగిన నాగోబా జాతర శనివారం ముగిసిన విషయం తెలిసిందే. నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో మెస్రం వంశీయులు జాతరను ముగించారు. నాగశేషుడికి మనసారా మొక్కి వెళ్లొస్తాం నాగోబా అంటూ కెస్లాపూర్ నుంచి బుడుందేవ్ పూజలకు శ్యాంపూర్ బాట పట్టారు. మెస్రం వంశీయుల పూజలు ముగిసినా భక్తుల దర్శనార్ధం మరో రెండు రోజుల పాటు జాతర సాగనుంది.
జనవరి 28 న పుష్య అమావాస్య అర్థరాత్రి 11 గంటలకు గంగాజలాభిషేకంతో మహాపూజ ప్రారంభం కాగా.. భేతల్ దేవుడికి మండగాజలి పూజలతో జాతర ముగిసింది. మొదటి రోజు అర్థరాత్రి మహాపూజ అనంతరం కొత్త కోడళ్ల పరిచయ వేడుక భేటింగ్ సాగగా.. 41 రోజుల ఉపవాస దీక్షలను విరమించిన మెస్రం వంశీయులు రెండో రోజు జాతరలో భాగంగా బాన్ దేవుడికి, పెర్సపేన్ దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు.
మూడవ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్క్రతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా.. నాలుగో రోజు గిరిజన సమస్యలకు పరిష్కార మార్గం చూపే గిరిజన దర్బార్ సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ ఏడాది అధికారులు, ప్రజాప్రతినిధులు వేరు వేరుగా దర్బార్లో పాల్గొన్నారు.