హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగభద్రత కల్పించి, రూ.35 వేలు వేతనం అందించాలని ధూపదీప నైవేద్యఅర్చక సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అర్చక చైతన్య యాత్రలో భాగంగా సోమవారం హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరుకాపు భవనంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ధూపదీప నైవేద్య అర్చకుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ మాట్లాడుతూ 18 ఏండ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో అర్చక విధులు నిర్వహిస్తూ జీవితమంతా దేవుని సేవలో హారతికర్పూరంలా కరిగిపోతున్నా ఉద్యోగభద్రత లేకపోవడంతో అర్చక కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో డీడీఎన్ పథకం కింద 6,758 మంది అర్చకులు పని చేస్తున్నారని, వీరికి నెలకు గౌరవ వేతనంగా రూ. 6వేలు, ధూపదీప నైవేద్యానికి రూ.4 వేలు కలిపి మొత్తంగా రూ.10 వేలు ప్రభుత్వం అందిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం దేవాలయ నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నదని చెప్పారు. కనీస గౌరవ వేతనం రూ.25 వేలతోపాటు ధూపదీప నైవేద్యానికి రూ.10 వేలుగా మొత్తంగా రూ. 35వేలు అందించాలని కోరారు. ప్రతినెలా ఐదో తేదీలోగా వేతనాలు చెల్లించి, హెల్త్‌కార్డులు, ఈహెచ్ఎస్ పథకం, వర్తింపజేయాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. అనంతరం ఏడీసీ కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణకు 12 డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి , వికారాబాద్ జిల్లాల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యశర్మ, లోకోర్తి జయతీర్థాచారి, ప్రధానకార్యదర్శులు విభూతి రాజేశ్, సునీల్‌జోషి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ప్రసాద్‌శర్మ, వెంకటాద్రిస్వామి, కన్వీనర్ అమరేశ్వరశర్మ, కోశాధికారి హరికిషన్ శర్మ, అధికార ప్రతినిధి రవికుమార్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అర్చకులు పాల్గొన్నారు.