ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో ముందే చెప్తారు
ఇకపై క్రమం తప్పకుండా భర్తీ
నోటిఫికేషన్ల మధ్య తగు వ్యవధి
హైదరాబాద్, మార్చి 9 : ఎప్పుడు ఏ ఉద్యోగాలను భర్తీచేస్తారో.. రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయో సమగ్రంగా తెలిస్తే ఎంత బాగుటుంది. నిశ్చింతగా ఉద్యోగాలకు ప్రిపేర్కావొచ్చు. కోరుకొన్న ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అచ్చం ఇలాంటి సమాచారాన్ని సమగ్రంగా తెలిపే వార్షిక ఉద్యోగాల క్యాలెండర్ రాష్ట్రంలో త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఈ క్యాలెండర్ ప్రకారం ఏటా ఏర్పడే ఖాళీలను సిద్ధం చేసి, క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అన్నింటినీ ఒకేసారి జారీచేయకుండా, నోటిఫికేషన్లకు మధ్య తగు వ్యవధిని పాటిస్తారు. ఏటా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి, అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు.
ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి విధానాన్ని ప్రస్తుతానికి యూపీఎస్సీ, కేరళ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారు. రిక్రూట్మెంట్ క్యాలెండర్లో భాగంగా ఒక ఏడాది కాలంలో భర్తీచేసే పోస్టుల వివరాలు, పరీక్షా తేదీలు, పరీక్షల విధానం, సిలబస్, సూచనలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం సహా మరికొన్ని వివరాలను పొందుపరుస్తారు. సాధారణంగా ఏటా జనవరిలో వార్షిక ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలలవారీగా ఏ నెలలో ఏ ఉద్యోగాలను భర్తీచేయనున్నారో, ఆయా వివరాలను క్యాలెండర్లో పొందుపరుస్తారని నిపుణులు చెప్తున్నారు.