హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూవివాదం నేపథ్యంలో తాజాగా మరోకొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే తొలి టెక్నాలజీ యూనివర్సిటీ అయిన జేఎన్టీయూ స్థలానికి హక్కు పత్రాలేవన్న విషయం బయటికొచ్చింది. హెచ్‌సీయూ భూవివాదం నేపథ్యంలో తమ వర్సిటీ స్థలాన్ని లాక్కుంటారేమోనన్న ఆందోళన వర్సిటీ అధికారులకు కలుగుతున్నది.
తమది లీజు స్థలమే కావడంతో అభివృద్ధి పేర తీసుకుంటారేమోనన్న అనుమానం వారిని పీడిస్తున్నది. దీంతో కూకట్‌పల్లిలోని స్థలంపై వర్సిటీకి హక్కుపత్రాలివ్వాలని ఇటీవలే పాలకమండలి తీర్మానం చేసింది. అనేక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా స్థలాలిస్తున్న సర్కారు.. ప్రభుత్వ విద్యాసంస్థ అయిన జేఎన్టీయూకు కూడా ఉచితంగా స్థలాన్ని కేటాయించాలని వర్సిటీ పాలకమండలి సర్కారును కోరింది.
ఏటా 2 కోట్ల చొప్పున 80 -100 కోట్ల వరకు హౌజింగ్‌బోర్డు, ప్రభుత్వానికి చెల్లించామని.. వర్సిటీ స్థలంపై పూర్తి హక్కులు కల్పించాలని ఆయా సమావేశంలో తీర్మానించింది. జేఎన్టీయూను 1972లో ఏర్పాటు చేశారు. ఈ వర్సిటీకి కూకట్‌పల్లిలో 89 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం హౌజింగ్ బోర్డుది కాగా, ఈ 89 ఎకరాల స్థలాన్ని లీజు పద్ధతిలో వర్సిటీకి అప్పగించారు.
కొంతకాలం వరకు ఏటా రూ. 2 కోట్లను వర్సిటీ హౌజింగ్ బోర్డుకు చెల్లించింది. అయితే 9ఏండ్ల క్రితం హౌజింగ్ బోర్డును ప్రభుత్వం రద్దుచేయడంతో బోర్డు స్థలాలన్నీ ప్రభుత్వపరమయ్యాయి. వర్సిటీ స్థలం విలువను రూ. 80 కోట్లుగా పరిగణించి వర్సిటీకి ఉచితంగా హక్కుపత్రాలివ్వాలని విద్యార్థులు, ఆచార్యులు కోరుతున్నారు.