హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఈ ఏడాది మేలో నోటిఫికేషన్ విడుదలచేశారు. సెప్టెంబర్లో సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించి వెంటనే ఫలితాలు విడుదలచేశారు. అయితే, ఫలితాలు విడుదలయ్యాక జరగాల్సిన అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేశారు. అర్హత సాధించిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికెషన్ ప్రక్రియ కోసం గత నెల 24 నుంచి 26 వరకు షెడ్యూల్ ప్రకటించారు. కానీ, ఆ తర్వాత షెడ్యూల్ను రద్దు చేశారు. దీంతో పీహెచ్డీ అడ్మిషన్ ప్రక్రియకు బ్రేక్ పడడంతో అర్హత సాధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోనని జంకుతున్నారు. ఈ ఏడాదిలో అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందా? లేదా? అని అధికారులను నిలదీస్తున్నారు. అయినా వారి నుంచి సమాధానాలు రావడంలేదు. కాగా, అర్హత పరీక్షకు దాదాపు 2వేల మంది హాజరుకాగా, 700 మంది వరకు అర్హత సాధించినట్టు సమాచారం.
రెండేండ్ల తర్వాత నోటిఫికేషన్..
జేఎన్టీయూలో దాదాపు రెండేండ్ల క్రితం పీహెచ్డీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలచేశారు. దాంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అనేక ఒత్తిడులు తీసుకురాగా, దిగివచ్చిన అధికారులు ఎట్టకేలకు ఈ ఏడాది మేలో నోటిఫికేషన్ విడుదలచేశారు. కానీ, ఆ ప్రక్రియ మాత్రం ముందుకెళ్లకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఈ విషయంపై జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. నవంబర్ 6 నుంచి 9 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉండొచ్చని తెలుపగా, ఆయా తేదీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదేని సంబంధిత అధికారులు వెల్లడించారు.