హైదరాబాద్ సిటీబ్యూరో/రవీంద్రభారతి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో పదేండ్లుగా అవమానానికి గురవుతూ మానసిక వేదనకు లోనయ్యానని, తనకెంతో పరువునష్టం జరిగిందని, ఈ విషయంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుపై న్యాయపోరాటం చేస్తానని కేసులో బాధితుడు జెరూసలేం ముత్తయ్య తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్చోరీపై పోరాటం చేయడం కాదని, తెలంగాణలో ఓట్ చోరీకి పాల్పడిన కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి సీటు నుంచి దింపాలని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్బా గ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తనకు సంబంధం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తన పేరును క్వాష్ చేసిందని గుర్తుచేశారు.
ఈ కేసులో ఏ4గా తన పేరు చేర్చారని, తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణ పేరిట కార్యాలయం చుట్టూ తిప్పారని వాపోయారు. పదేండ్లుగా ఏసీబీ, సివిల్, హైకోర్టు, సుప్రీంకోర్టులు, ఏపీ, తెలంగాణలోని వివిధ పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి తన సమయం, డబ్బు వృథా చేసుకున్నాని ఆవేదన వ్యక్తంచేశారు. ఫిర్యాదుదారుడు మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్తో పాటు తెలంగాణ ఏసీబీ, పోలీసు అధికారులపై సాంకేతిక నష్టపరిహారం కోసం నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేయనున్నట్టు తెలిపారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్న వాయిస్ రికార్డులు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, సెల్‌ఫోన్ సిగ్నల్స్, టవర్ లొకేషన్స్, టీడీపీ పొలిటికల్ బెనిఫిట్స్, మహానాడు వీడియోలు ఇలా అన్ని సాంకేతిక ఆధారాలున్నా, దోషిగా శిక్ష పడాల్సిన వ్యక్తి అప్పుడు తన ప్రభుత్వ హయంలో న్యాయ వ్యవస్థను ప్రలోభాలకు గురిచేశాడని ముత్తయ్య ఆరోపించారు. ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ పేరుతో ప్రత్యక్ష సాక్షి అయిన తన పేరును తప్పించారని చెప్పారు.
రూ. 50 లక్షల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి తెలివిగా ఈ కేసు ఎమ్మెల్యేలకు వర్తించదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడని, లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనంతో పాటు తన అక్రమ సంపాదన డబ్బుతో సుప్రీంకోర్టులో కేసు కొట్టేయించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. తన న్యాయ పోరాటానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, న్యాయవాదులు, ఎన్ఆర్ఐలు, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి బాధితులు సహకరించాలని కోరారు.