హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కాంగ్రెస్‌లో మొదలైన చిచ్చు మరింత ముదిరింది. ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పట్టువీడడం లేదు. ఆయనను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చల్లో జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు నానా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా తన ప్రత్యర్థిని ఎలా చేర్చుకుంటారని, విలువలేనిచోట ఉండడం ఎందుకని ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. స్పందించిన మంత్రులు గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని, సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం.
అంతేకాదు, మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడించేందుకు మంత్రులు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో ఫోన్లో మాట్లాడించినట్టు తెలిసింది. జీవన్‌రెడ్డిని ఆమె బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని చెప్పినట్టుగా తెలిసింది. అయినప్పటికీ జీవన్‌రెడ్డి పట్టు వీడకపోవడంతో ఇప్పుడే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయవద్దని, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై రెండ్రోజులుగా ఆగ్రహంగా ఉన్న జీవన్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ మీతో మాట్లాడారా? అన్న విలేకరుల ప్రశ్నకు దీపాదాస్ మున్షీ ఒక్కరే మాట్లాడారని, మరెవరూ తనతో మాట్లాడలేదని జీవన్‌రెడ్డి చెప్పారు.
గంటన్నరపాటు బుజ్జగించినప్పటికీ జీవన్‌రెడ్డి పట్టువీడకపోవడంతో మంత్రులు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు ముభావంగా వెనుదిరిగారు. చర్చల అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ అలకవీడడంపై జీవన్‌రెడ్డి ఎలాంటి ప్రకటనా చేయలేదని తెలిపారు. శ్రీధర్‌బాబు మాత్రం మీడియాతో మాట్లాడలేదు.
తనకు అన్యాయం జరిగిందన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. చైర్మన్‌ను కలిసేందుకు సమయం అడిగానని, తాను అందుబాటులో లేనట్టు ఆయన చెప్పారని జీవన్‌రెడ్డి వెల్లడించారు. మండలి కార్యదర్శిని కలిసి రాజీనామా పత్రం ఇద్దామనుకున్నా ఆయన కూడా అందుబాటులో లేరని తెలిపారు. రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటివద్ద మంగళవారం హైడ్రామా నెలకొన్నది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారనే సమాచారంతో ఉదయం నుంచే భారీగా కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు వచ్చినప్పుడు జీవన్‌రెడ్డికి అనుకూలంగా, పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జీవన్‌రెడ్డికి జరుగుతున్న అవమానంపై పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని నిలబెట్టిన, సీనియర్ నాయకుడైన జీవన్‌రెడ్డినే పట్టించుకోకపోవడం ఏంటని అగ్రహం వ్యక్తంచేశారు. జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు లేకుంటే ఇప్పుడు పార్టీకి అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండి, జెండాను భుజాలపై మోసిన సీనియర్ నేతలను అధికారంలోకి వచ్చాక ఇలా అవమానించడం దుర్మార్గమని మండిపడ్డారు.