Jeevan Reddy | హైదరాబాద్/ జగిత్యాల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన, అత్యంత భావోద్వేగభరిత దృశ్యం ఎర్రవెల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే ధీశాలి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు.
ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగిన ఈ కలయిక కేవలం రాజకీయ భేటీగా కాకుండా, ఇద్దరు పాత మిత్రుల ఆత్మీయ సంగమంగా నిలిచిపోయింది. కేసీఆర్‌ను చూడగానే జీవన్‌రెడ్డి ఒకసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ చేతులు పట్టుకుని.. ‘అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడువాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ల్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అన్నా..’ అంటూ మనసులోని మాటను బయటపెట్టారు.
ఈ సందర్భంగా కేసీఆర్.. జీవన్‌రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనను అనునయిస్తూ, శాలువాతో ఘనంగా సన్మానించి సాదరంగా ఆహ్వానించారు.
గజ్వేల్ గడ్డపై ఘన స్వాగతం
తొలుత ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న జీవన్‌రెడ్డికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆయనను కేసీఆర్ వద్దకు తోడ్కొని వెళ్లారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కే సంజయ్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవన్‌రెడ్డి వెంట ఆయన కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంతాసురేశ్ దంపతులు కూడా ఉన్నారు. సురేశ్ దంపతులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
లంచ్ మీటింగ్‌లో కీలక చర్చలు
ఆత్మీయ పలుకరింపుల అనంతరం జీవన్‌రెడ్డి బృందానికి కేసీఆర్ లంచ్ ఆతిథ్యం ఇచ్చారు. భోజనం చేస్తూనే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతాంగ సమస్యలు, తెలంగాణ ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల పక్షాన నిలబడే ఇద్దరు అగ్రనేతలు ఒకే తాటిపైకి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘తెలంగాణతనానికి దర్పణం జీవన్‌రెడ్డి.. రైతు బాంధవుడు కేసీఆర్.. ఈ ఇద్దరి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను నిర్దేశించబోతున్నది’ అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.