PV Narasimha Rao | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు ఆత్మను కాంగ్రెస్ నేతలు మరోసారి క్షోభ పెడుతున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా, ఇప్పటికీ పదే పదే పచ్చి అబద్ధాలు చెప్తూ అవమానిస్తున్నారని రగిలిపోతున్నారు. పీవీ మరణానంతరం ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలని కుటుంబసభ్యులు పట్టుబట్టారు. కానీ, అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అది సాధ్యం కాదని చెప్పి పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు పంపించారు.
ఢిల్లీలో పీవీ స్మారకం నిర్మించాలన్న డిమాండ్‌ను కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించినా, ఇప్పటికీ పీవీకి ప్రత్యేకంగా ఎలాంటి స్మారకం నిర్మించకపోవడం ఆ పార్టీ పెద్దలు తెలంగాణ బిడ్డ పీవీని అవమానించిన తీరుకు నిదర్శనం. పీవీ విషయంలో నాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే హైదరాబాద్‌లో పీవీ విగ్రహం ఏర్పాటు చేసింది. తెలంగాణతోపాటు దేశ, విదేశాల్లో పీవీశతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.
పీవీని ఉన్నతంగా గౌరవించిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాస్తవాలు ఇలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. పీవీ మరణానంతరం ఆయన కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకే పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తరలించినట్టు జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై పీవీ కుటుంబసభ్యులు భగ్గుమన్నారు. జీవన్‌రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని పీవీ కూతురు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కుండబద్దలు కొట్టారు.
‘ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్తామని మా కుటుంబంలో ఎవరూ చెప్పలేదు. వాస్తవానికి హైదరాబాద్‌కు తీసుకురాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాం. కానీ, కాంగ్రెస్ పెద్దల ఆదేశం మేరకు మా ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు ఢిల్లీలో ప్రత్యేకంగా స్మారకం నిర్మిస్తామని అప్పట్లో మాకు హామీ ఇచ్చారు. కానీ ఢిల్లీలోగానీ, హైదరాబాద్‌లోగానీ ఇప్పటివరకు పీవీకి ఎలాంటి స్మారకం నిర్మించలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఇప్పుడు ఈ విషయాన్ని లేవనెత్తాల్సిన అవసరమే లేదని స్పష్టంచేశారు. ‘జీవన్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మా కుటుంబసభ్యులను తీవ్ర మనో వేదనకు గురిచేస్తున్నారు. నాటి చీకటి రోజులను మళ్లీ గుర్తుకు తెస్తూ క్షోభ పెడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పీవీ కుటుంబసభ్యులు జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి, కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకే హైదరాబాద్‌కు తరలించారని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ అదే నిజమైతే.. కుటుంబసభ్యుల్లో ఎవరు ఒప్పుకున్నారో జీవన్‌రెడ్డి చూపించగలరా? కనీసం ఏదైనా సాక్ష్యం ఉన్నదా? ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఎక్కడున్నారు?’ అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేతకు స్వయంగా ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
మీ రాజకీయాల్లోకి అనవసరంగా పీవీని ఎందుకు వాడుకుంటున్నారు? దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన పరువు ఎందుకు తీస్తున్నారంటూ మండిపడ్డారని తెలిసింది. ‘ఆ రోజు ఢిల్లీలో మాకు జరిగిన అనుభవం ఏమిటో ప్రజలకు చెప్తే.. కాంగ్రెస్ నేతలు తలెత్తుకొని తిరగలేరు. ఆరు దశాబ్దాలపాటు నిస్వార్థంగా, చిత్తశుద్ధితో పార్టీకి సేవ చేసిన వ్యక్తి పట్ల నాటి కాంగ్రెస్ అధినాయకత్వం వైఖరి బయటపడితే మీ పరువు పోతుంది’ అని సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ఆ సీనియర్ నేత వారి ఆవేదన సరైనదేనని ఒప్పుకుంటూ క్షమాపణ కోరినట్టు సమాచారం. తమ పార్టీకి చెందిన నేతలు ఈ విషయంలో మాట్లాడకుండా ఉండాల్సిందని ఆ నేత అభిప్రాయపడినట్టు తెలిసింది.
సీలేరు విద్యుత్తు కేంద్రంతోపాటు ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ధారదత్తం చేస్తే.. దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీయే పోరాడిందని దేశపతి శ్రీనివాస్ చెప్పారు. ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్‌కు 70-80 మంది సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుడు బీఆర్ఎస్కు రాజ్యసభలో ఉన్న ఏకైక సభ్యుడు కేకే మాత్రమే దీనిపై మాట్లాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై తెలంగాణలోని ఏడు మండలాలను లాక్కున్నారని విమర్శించారు. విభజన హామీల్లో ఒకటైన కోచ్ ఫ్యాక్టరీని సాధించేందుకు కాంగ్రెస్ ఎంపీలు ఏనాడూ పార్లమెంటులో మాట్లాడలేదని విమర్శించారు.
అప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాళేశ్వరం గురించి పార్లమెంటులో మాట్లాడారు కానీ రాష్ర్టానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనబోమని కేంద్రం చెప్పినా కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని మండిపడ్డారు. రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసింది బీఆర్ఎస్ అయితే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావును తిడితే మంత్రి పదవి వస్తుందని జీవన్‌రెడ్డి భావిస్తున్నట్టున్నారని, సీనియర్ నేతగా ఆయనకు మంత్రి పదవి పొందే హక్కు ఉన్నదని పేర్కొన్నారు. ఒక సీనియర్ నాయకుడిగా జీవన్‌రెడ్డిపై తనకు గౌరవం ఉన్నదని, హరీశ్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టంచేశారు.