హైదరాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం బరాజ్‌లు సురక్షితమని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నివేదిక ఇవ్వడం రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ నివేదిక వచ్చి నాలుగు రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాఉడతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’ అని ఇన్నాళ్లూ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ వచ్చారని, మేడిగడ్డ బరాజ్‌లో కేవలం ఒక పియర్ కుంగితే, ఎన్డీఎస్ఏను సాకుగా చూపి నెలల తరబడి ప్రాజెక్టును పడావు పెట్టాడని విమర్శించారు.
ఇప్పటివరకు వాటి మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 33 నెలల కాంగ్రెస్ పాలన కేవలం మాటలకే పరిమితమైందని, ప్రాజెక్టుల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం, అందాల పోటీల కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, రైతుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసి మేడిగడ్డను బాగు చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి బేషజాలకు పోకుండా కన్నెపల్లి మోటర్లను ఆన్ చేసి కాళేశ్వరం రిజర్వాయర్లను నింపి రైతులు సాగుచేసిన పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వామియాదవ్, రఘురామ్, వీరబాబు పాల్గొన్నారు.