హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ల్లో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్‌సెట్ కోచింగ్ అగమ్యగోచరంగా మారింది. క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీచేసిన ఉన్నతాధికారులు నిర్వహణను గాలికి వదిలేశారు. ఆయా పరీక్షలకు ఉన్నది స్వల్ప గడువే కాగా, ఇప్పటికీ చాలా కేంద్రాల్లో శిక్షణ ప్రారంభం కాని దుస్థితి. విద్యార్థులు క్యాంపుల్లో ఉండగా, శిక్షణ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పేపర్ మూల్యాంకన విధుల్లో చేరారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సీవోఈల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం.
పేదింటి బిడ్డల ఆశయాలకు ఆయువును పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, కలలను సాకారం చేయాలని ఉదాత్త లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 38 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేసింది. అందులో బాలికలకు 20, బాలురకు 17, కో ఎడ్యుకేషన్ విధానంలో ఒక సీవోఈని నెలకొల్పింది. ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎప్‌సెట్ కోసం ప్రత్యేక కోచింగ్ ఏర్పాటు చేసేవారు. ఈ సారి కూడా గత నెల 26న సీవోఈ అకాడమిక్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై ఈ నెల 14 నుంచి కోచింగ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. నాన్ సీవోఈ గురుకులాల్లో కూడా కోచింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో సీవోఈల్లో 3వేల మంది, నాన్ సీవోఈల్లో 1400 మంది విద్యార్థులకు శిక్షణ ప్రారంభం కావాల్సి ఉన్నది.
ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి రోజువారీగా తరగతులు, సబ్జెక్టుల వారీగా టెస్ట్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్స్ విధులకు హాజరవుతారు. సెలవుల్లో పనిచేసిన రోజులకు గతంలో రెమ్యూనరేషన్ ఇవ్వగా, ప్రస్తుతం ఈఎల్ (వేతనంతో కూడిన సెలవు)ను మంజూరు చేస్తున్నారు. క్యాంపుల నిర్వహణ సంబంధిత సీవోఈ ప్రిన్సిపాల్, సిబ్బంది బాధ్యతే. క్యాంపులను నిర్వహించాలని సొసైటీ ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేసినా ఎక్కడా క్యాంపులు కొనసాగని పరిస్థితి. కారణమేమంటే అధ్యాపకులు అందుబాటులో లేకపోవడమే. అదేమంటే సీవోఈల్లోని ప్రిన్సిపాల్, అధ్యాపకులందరూ ఇంటర్ పేపర్ల స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలను అలాట్ చేశారు. కొందరు ప్రత్యేకంగా కేటాయించుకున్నారు. వాల్యుయేషన్‌కు హాజరైతే సగటున ఒక్కొరికి రూ.15వేల నుంచి 20వేల వరకు అదనంగా రెమ్యునరేషన్ వచ్చే అవకాశమున్నది. దీంతో సిబ్బంది సైతం స్పాట్ వాల్యుయేషన్కే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. సెలవులను ప్రకటించాక క్యాంపులను నిర్వహిస్తే ఈఎల్స్‌ను సైతం పొందవచ్చనేది తెలుస్తున్నది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితినంతటినీ సొసైటీ అకాడమిక్ ఉన్నతాధికారులకు సంబంధిత ప్రిన్సిపల్స్ సైతం వివరించారు. సిబ్బందిని స్పాట్ వాల్యుయేషన్ నుంచి మినహాయించాలని కోరారు. కానీ సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం క్యాంపుల నిర్వహణ వైపు చూసింది లేదని తెలుస్తున్నది.
సెకండియర్ పరీక్షలు ముగియడం.. కోచింగ్ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 4న జేఈఈ మెయిన్స్-2 సెషన్ ఎగ్జామ్ కొనసాగనున్నది. మే 3 నీట్, 4న ఎప్‌సెట్ జరుగనున్నాయి. జేఈఈకి మరో 14రోజులు మాత్రమే గడువు ఉండగా, మిగతా పరీక్షలకు 45రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ కోచింగ్‌ను ప్రారంభించకపోవడంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు సైతం సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.