హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. బీఈ, బీటెక్ విద్యార్థులకు ఈ పరీక్షలను 29 వరకు నిర్వహిస్తారు. పేపర్-1 బీఆర్క్, బీ ప్లానింగ్ విద్యార్థులకు 30న పరీక్ష ఉంటుంది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలుంటాయి. దేశవ్యాప్తంగా 6,29,778 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు.
రాష్ట్రం నుంచి 30వేలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 500 నగరాలు, విదేశాల్లోని 17 నగరాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు నగరాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.