JEE Main | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న పేపర్-2 (ఏ) బీఆర్క్, పేపర్ -2 (బీ) బీ ప్లానింగ్ పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ను ఎంటర్‌చేసి అడ్మిట్‌కార్డులను పొందవచ్చు. ఇక పేపర్ -1 (బీటెక్) పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతాయి. వీటిని 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహిస్తారు. పరీక్షల నేపథ్యంలో నిపుణుల సూచిస్తున్న జాగ్రత్తలు ఇవీ..
సూచనలు, సలహాలు
కొత్త చాప్టర్ల జోలికెళ్లొద్దు
పరీక్షలు సమీపించినందున అన్ని చాప్టర్స్‌ను ఈ సమయంలో ముందేసుకోవద్దు. కొత్త చాప్టర్ల జోలికెళ్లొద్దు. గణితంలో 15, ఫిజిక్స్‌లో 20, కెమిస్ట్రీలో 20 ప్రశ్నలు రాసేలా రివిజన్ చేయాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. పండ్ల రసాలు, పండ్లు వంటి సాఫ్ట్ఫుడ్ మాత్రమే తీసుకోవడం మంచిది. గణితంలో సెట్ రిలేషన్, సిరీస్, త్రీడీ జామెట్రీ, వెక్టార్స్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నంబర్స్ వంటి సబ్జెక్టులను రివిజన్ చేయడం ఉత్తమం.
– ఎం నాగభూషన్‌రావు, గణితం సబ్జెక్టు నిపుణుడు
పరీక్ష రోజే అత్యంత కీలకం
ఈ సారి సిలబస్‌ను మార్చారు. కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని కలిపారు. ఇప్పటికే ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఇది నష్టం చేకూరుస్తుంది. అయితే సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాల నుంచి గతంలో కఠినమైన ప్రశ్నలొచ్చేవి. వాటినిప్పుడు తొలగించారు. కెమిస్ట్రీ నుంచి అధ్యాయాలను ఎక్కువగా తీసేశారు. ఇది విద్యార్థులకు కాస్త ఉపశమనం. మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి గతంలో 99 శాతం ఒక ప్రశ్న వచ్చేది. కానీ ఇప్పుడు పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటివి చాలా పాఠ్యాంశాలున్నాయి. పరీక్ష రోజు ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో తెలిసిన ప్రశ్నలకు తప్పులు చేయవద్దు.
– ఎం ఉమాశంకర్, ఆలిండియా ఐఐటీ కో ఆర్డినేటర్, శ్రీచైతన్య విద్యాసంస్థలు