హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ విషయంలో జాయింట్ అడ్మిషన్స్బోర్డు(జాబ్) యూటర్న్ తీసుకుంది. రెండు వారాల క్రితం మూడుసార్లు రాసే అవకాశం ఇచ్చిన జాబ్బోర్డు తాజాగా రెండుసార్లకు కుదించింది. ఈ నెల 15న జాబ్ బోర్డు సమావేశాన్ని నిర్వహించగా, మూడు నుంచి రెండుసార్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా, ఈ నిర్ణయాన్ని ఐఐటీ కాన్పూర్ సోమవారం వెల్లడించింది. ఒక విద్యార్థి వరుసగా రెండేండ్లు జేఈఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశముండగా, మూడుసార్లు రాసుకునే అవకాశం ఇస్తున్నట్టు ఈ నెల 5న జాబ్బోర్డు ప్రకటించింది. 2013 నుంచి అమలుచేస్తున్న పాత నిబంధనలే అమల్లో ఉంటాయని ఐఐటీ కాన్పూర్ తాజాగా ప్రకటించింది. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎలాంటి మార్పులుండవని స్పష్టమయ్యింది.
మెడికల్ పీజీ అడ్మిషన్లలో స్థానికత
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మెడికల్ పీజీ అడ్మిషన్లలో ‘స్థానికత’ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. ఈ అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 148కి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జీవో 148 ప్రకారం తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కౌంటరు దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. ఈ నెల 25 వరకు మెరిట్ జాబితాను ప్రకటించబోమని హామీ ఇచ్చారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.