హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘తంగేడుపూలు అంటే ఒప్పుకోను.. అవి బంగారు పూలు’ అని ఆచార్య డాక్టర్ ఎన్ గోపి అభివర్ణించారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత అందజేశారు. రూ.1,01,116 నగదుతోపాటు స్వర్ణకంకణాన్ని తొడిగి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపి మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని యావత్తు తెలంగాణ ప్రజల తరఫున లభిస్తున్న ప్రేమగా భావిస్తున్నానని చెప్పారు. సామాన్యుల్లో అసామాన్యుడైన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తాను అందుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. కార్యశీలతలో పువ్వులాంటి సున్నితత్వం, వజ్రంలాంటి కాఠిన్యాన్ని ఎమ్మెల్సీ కవితలో గుర్తించానని ప్రశంసించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పాటుపడుతున్న సంస్థను ఆమె నడపడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 1967లో తంగేడు పూలపై తాను రాసిన మొట్టమొదటి కవితను చదివి వినిపించారు.
తెలంగాణలోనే కళాకారులకు ‘గౌరవం’ :ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉన్నదని, ఇందులో భాగంగానే తెలంగాణ జాగృతి.. భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో..మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవటం అంతే ముఖ్యమని జాగృతి ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. ఇకపై ప్రతి ఏటా సాహిత్య సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 530 మంది కళాకారులకు గుర్తింపునిచ్చి గౌరవ వేతనం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. కేసీఆర్ అంటే కవులు, చరిత్రకారులు, రచయితలు అని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో మన గొంతుకను వినిపించాలని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్‌సార్ కోరితే ‘నమస్తే తెలంగాణ’ పుట్టిందని గుర్తుచేశారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
ఎత్తిపోతలతో ఎగిసిదుంకిన నీళ్లు: గోరటి
‘ఎత్తిపోతలతోని ఎగిసిదుంకిన నీళ్లు.. పుడమి పులకించి.. నింగినెగిసింది’ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి ఎమ్మెలీ గోరటి వెంకన్న కవిత్వం చదివి వినిపించారు. తెలంగాణకు కేసీఆర్ సీఎం కావడం సాహితీవేత్తలు, కవులు, రచయితలు అదృష్టంగా భావించాలన్నారు. కవిత్వమంటే మార్పును కాంక్షించేదై ఉండాలని అభిప్రాయపడ్డారు.
కవిత కృషితో బతుకమ్మకు ఖ్యాతి: సిధారెడ్డి
భారత జాగృతి సాహిత్య సభలు నిర్వహించడం సంతోషంతోపాటు ఉద్వేగంగా ఉన్నదని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి పేర్కొన్నారు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంలో కవిత కృషి అమోఘమని కొనియాడారు. కవిత బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు.
బతుకమ్మ అంటే కవితే: దేవకీదేవి
బతుకమ్మ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎమ్మెల్సీ కవితనే అని 1969 ఉద్యమ నాయకురాలు డాక్టర్ తిరునగరి దేవకీదేవి పేర్కొన్నారు. మన భాష, సంస్కృతి పరిరక్షణకు సురవరం ప్రతాపరెడ్డి ఎలా పనిచేశారో.. జాగృతికూడా అలా కృషిచేస్తున్నదని తెలిపారు. మన భాష, మన మాండలికాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
‘జాగృతి’తో సాహిత్య వికాసం: శ్యామల
జాగృతిలాంటి సంస్థ ఉండగా తెలుగు భాషకుగానీ, సాహిత్యానికి, కవులు, రచయితలు, కళాకారులకుగానీ ఎలాంటి ఢోకాలేదని ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం మరింత వికసించేందుకు కృషి చేస్తున్న కవితకు అభినందనలు తెలిపారు. 2014 తర్వాత భాండాగారాలను తలపించేలా సాహిత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది అని చెప్పారు.
పాలమీది మీగడలా కవిత్వం: నాలేశ్వరం
పాలమీది మీగడలా తెలంగాణ సాహిత్యం, కవిత్వం పరిఢవిల్లుతున్నదని ప్రముఖ కవి నాలేశ్వరం శంకరం పేర్కొన్నారు. రాష్ట్రమంతటా సాహితీపరిమళాలు వెదజల్లుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న అలిఖిత సాహిత్యానికి జీవంపోయాల్సిన బాధ్యత జాగృతి సంస్థదేనని అభిప్రాయపడ్డారు.
ఇది కవుల రాజ్యం: ఏనుగు నర్సింహారెడ్డి
ఒకప్పుడు తెలంగాణలో కవులు పూజ్యం అనేవారని, ఇప్పుడు కవుల రాజ్యంగా పేరుగాంచిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్, ప్రముఖ కవి ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇదంతా తెలంగాణ సారస్వత పరిషత్తు, భారత జాగృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే సాధ్యమైందని చెప్పారు.
కవులను ప్రోత్సహించిన సీఎం: తిగుళ్ల
కవిత్వ పోటీలు పెట్టి కవులను ప్రోత్సహించాలని చెప్పిన ఏకైక సీఎం కేసీఆరేనని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి పేర్కొన్నారు. కవిత అంటే సార్థక నామధేయురాలని, తెలంగాణ తల్లి మెడలో వేసిన సాహితీ సుమమాల అని అభివర్ణించారు. తిరుమలకు అన్నమయ్య ఉన్న ట్టు.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఈగ బుచ్చిదాసు అనే సంకీర్తనాచార్యుడున్నారని, ఆయన దాదాపుగా 400పైగా కీర్తనలు రాశారని ఎమ్మెల్సీ కవితకు తెలియజేస్తే.. రెండే నిమిషాల్లో స్పందించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, భారత్ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, ప్రముఖ కవులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.