హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కట్టడాల మీద త్రిశూలం, స్వస్తిక్, తిరునామాల వంటి సంకేతాలు పెడుతున్నట్టు తెలిసిందని, ఈ గుర్తులు కొన్ని తాళపత్రాల మీద ఉన్నాయని చెప్తున్నారని, ఈ సంకేతాలు కలిగిన తాళపత్రాలను బయట ప్రపంచానికి తెలియజేస్తే బాగుంటుందని రచయిత, తాళపత్ర పరిశోధకుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అభిప్రాయపడ్డారు. మేడారంలో గుర్తులను తాళపత్రాలు చూసి వేశామని చెప్తున్నట్టు తెలిసిందని, ఆయా తాళపత్రాలు రాసిన పండితుల వివరాలు వెల్లడిస్తే తెలుగు సాహిత్య చరిత్రకు ఉపయోగపడుతుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తాళపత్రాలు ఏ భాషలో ఉన్నాయో తెలుసుకోవడం పరిశోధకుల కర్తవ్యమని స్పష్టంచేశారు. అంతేకాకుండా, కోయ ప్రజల చరిత్రకు సంబంధించిన సంకేతాలు తాళపత్రాల్లో ఉన్నాయా?
ఒకవేళ ఉంటే వాటిని బయటపెట్టడం చారిత్రక అవసరమని తెలిపారు. వాటి మూల ప్రతులను ప్రకటించడం అనివార్యమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆదివాసీలకు ఒక లిపి ఉన్నదా? లేదా? తెలుగు భాషలోనే ఉన్నాయా? అనే విషయాలు ఆసక్తిగొల్పుతున్నాయని, ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత తనతోపాటు అందరికీ ఉంటుందని, వాటిని చూపించడం.. అవి ఉన్నాయని చెప్పేవాళ్ల బాధ్యత అని స్పష్టంచేశారు. తాళపత్రాలు ఉన్నాయని చెప్పేవారు వాటిని చూపించకపోతే తప్పు అవుతుందని, కాబట్టి ఒకట్రెండురోజుల్లోనే వాటిని బయటపెట్టాలని కోరారు. తాను వేసిన పుస్తకంపై మైపతి అరుణ్‌కుమార్ చెప్పిన అంశాలపై వరుస కథనాలు రాయగలనని, అందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో శనివారం వచ్చిన ఇతర అంశాలతో తనకు సంబంధం లేదని జయధీర్ తిరుమల్‌రావు పేర్కొన్నారు.