Ram Chander Naik | చిన్నగూడూరు/మరిపెడ, ఏప్రిల్ 17 : ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ అధికారులపై నోరుపారేసుకున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు, మరిపెడలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అధికారులపై తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. చిన్నగూడూరు మండలం విస్సంపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ తహసీల్దార్‌తో మాట్లాడుతూ.. ఇసుక రవాణా అనుమతులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇడియట్ మాటలు మాట్లాడకు.. ఇసుక రవాణాకు అనుమతించడంలేదు ఎందుకు? ప్రభుత్వ విప్‌ను, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ను, నాదీ కలెక్టర్ ర్యాంకే, ఇసుక రవాణాకు టోకెన్ సిస్టం పెట్టి ప్రభుత్వ పనులకు తక్షణమే అనుమతించండి. రిటైర్మెంట్ సమయంలో సస్పెండ్ కాకుండా చూసుకోండి. రాత్రీపగలు తేడా లేకుండా ఆకేరు ఇసుకను దొంగలపాలు చేస్తున్నరు. ఈ పాపం మీదే. పోలీస్, రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేయండి’ అంటూ హెచ్చరించారు.
మరిపెడ మండలం గిరిపురంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ ముందే ఎమ్మెల్యే అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. ‘నియోజకవర్గంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎస్సైలు, కార్యదర్శులు ఎవరూ నా మాట వినడం లేదు. నా పదవి ఇప్పుడే అయిపోదు. అధికారులు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేసి వ్యాపారాలు చేసుకోండి’ అని హెచ్చరించారు. అధికారులు ఉద్యోగాలకు వచ్చామా?, పోయామా? అన్నట్టు వ్యహరించడం సరికాదని అన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు కట్టడి చేయడం లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ చిన్నగూడూరు, మరిపెడ తహసీల్దార్లను దూషించడాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్, సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, తహసీల్దార్ల అసోసియేషన్ నాయకులు సైదులు, భగవాన్‌రెడ్డి, నాగరాజు, సునీల్‌రెడ్డి, మహబూబ్ ఓ ప్రకటనలో ఖండించారు. జీవోను కాదని ఇసుక అనుమతులు ఇచ్చే అధికారం అధికారులకు లేదనే విషయం ఎమ్మెల్యే గ్రహించకుండా తహసీల్దార్లను దూషించడం తగదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న తహసీల్దార్లపై సభాముఖంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.