కాసిపేట, ఆగస్టు 19 : నా భర్త భూమి నాది కాదు అంటున్నారని, నాకే సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, నాపై దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టి భూమిని లాక్కుంటున్నారని, నాకు న్యాయం చేయాలని జనుప మల్లమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వృద్దురాలు జనుప మల్లమ్మ తన కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది.
వృద్దురాలు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కాసిపేట గ్రామ పంచాయతీ శివారులోని 213 సర్వే నెంబర్ లో గల రెండు ఎకరాల భూమి తన భర్త భూమయ్య పేరు ఉండగా భర్త చనిపోవడంతో కొడుకు జనుప రాంచందర్ పేరుపై పత్రాలు చేసుకున్నారన్నారు. కొడుకు చనిపోవడంతో కోడలు జనుప అల్లిక నాపై దాడి చేసి నా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్నారు. వృద్ధురాలైన నన్ను కనీసం పట్టించుకోవడంలేదని, ఇంట్లోకి రానిస్త లేదని కన్నీరు మున్నీరయ్యారు. నా భర్త భూమి నాకు హక్కు ఉందని, కానీ కోడలు కొంత మందితో కలిసి నన్ను కొట్టి నా ఇంట్లోకి రానిస్తలేదన్నారు. మా భూమిని వేరే వాళ్ళతో కలిసి మొత్తం తీసుకోవాలని చూస్తుందని, భూమి మొత్తం తీసుకుంటే నేను ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేసింది. లంక లక్ష్మణ్, కుర్మ నర్సయ్య అనే గ్రామ పెద్ద మనుషులు నా తరుపును న్యాయం కోసం ఎవరు మాట్లాడినా వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, నాకు జీవన ఆధారం లేదని, దీని కారణంగా నా భర్తకు సంబంధించిన భూమి విషయంలో సీనియర్ సిటీజన్ యాక్ట్ ప్రకారం నాకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సమావేశంలో కూతురు గౌరి భాగ్య లక్ష్మీ, గొడిసెల బాలయ్య, నిచ్చకోల పోషం తదితరులు పాల్గొన్నారు.