జనగామ, మే 27 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలు, మారెట్ యార్డుల్లో అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యం, మకలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు కేంద్రాలను తాను స్వయంగా సందర్శించినప్పుడు బస్తాల కొరత, ధాన్యం లిఫ్టింగ్‌లో జాప్యం, హమాలీల సమస్య తీవ్రంగా ఉందన్నారు. అకాల వ ర్షాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని పల్లా విమర్శించారు.
కొనుగోలు కేంద్రాల్లో కనీసం టార్పాలిన్లు, గోనె సంచులు, రవాణా సౌకర్యాలు వంటి ప్రాథమిక ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కేవలం జనగామ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నదన్నారు. నెల రోజులుగా రైతులు ధాన్యం రాశుల వద్ద కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ప్రతి గింజనూ తేమ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పల్లా డిమాండ్ చేశారు.