హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): జానకమ్మ మరణం ముఖ్యంగా, దక్షిణ భారత సంగీతానికి, పాటకు తీరని లోటని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు అభిమానులంతా జానకమ్మ అని ప్రేమతో పిలుచుకునే, సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణంపై ఆయన సంతాపం ప్రకటించారు. గాన కోకిలగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న జానకమ్మ గాత్రం అజరామరమని కొనియాడారు. చిన్న నాటినుండే సంగీతం, గానంపై మకువతో సినీ నేపథ్యగాయనిగా తన ప్రస్థానాన్ని సాగించిన జానకమ్మ, 60ఏండ్ల సంగీత జీవితంలో దాదాపు 50వేల పాటలు పాడి, భారత సంగీతవనంలో పాటల కుసుమాలను పూయించిన మహోన్నత గాయని అని కేసీఆర్ శ్లాఘించారు. సినీ నేపథ్యగాయనిగా, సంగీత దర్శకురాలిగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. తదితర భారతీయ భాషల్లో పాటలు పాడుతూ సినీ సంగీత జగత్తుకు ఆమె చేసిన కృషి, దేశ సాంసృతిక రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని కేసీఆర్ కీర్తించారు.
వృత్తిలో అనేక ఉత్తమోత్తమ అవార్డులను సొంతం చేసుకున్న జానకమ్మ, హృదయాన్ని హత్తుకునే, మనసును కదిలించే గాత్రంతో పాటు, సామాజిక సృ్పహ కలిగి ఉన్న గొప్పగాయనీమణి అని కేసీఆర్ స్మరించుకున్నారు. దక్షిణాది కళాకారులకు జరుగుతున్న సాంసృతిక అన్యాయాన్ని సహించలేక భారత ప్రభుత్వం తనకు 2013లో ప్రకటించిన ‘పద్మభూషణ్’ పురసారాన్ని తిరసరించిన ధీర వనిత జానకి అని కొనియాడారు. పసిపాప నుంచి పండు ముదుసలి వయస్సు వరకు అన్ని రకాల పాత్రలకు తగ్గట్టుగా తన గాత్రాన్ని పాటగా మలిచి, సందర్భానికి తగ్గట్టుగా గమకాలతో నవరసాలను తన గానంలో నింపుకొని గానామృతాన్ని పంచిన జానకమ్మ , భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా నాటి కరీంనగర్ జిల్లాలో జీవించడం, వారి కుటుంబం సిరిసిల్ల వాసులు కావడం తెలంగాణకు గర్వకారణమని పేరొన్నారు. జానకమ్మ మరణం ముఖ్యంగా, దక్షిణ భారత సంగీతానికి, పాటకు తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ వంటి మహా గాయనికి
జరా మరణాల భయం ఉండదనీ, వారి కీర్తి అజరామరమని తెలిపారు. జానకమ్మ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.