జనగామ చౌరస్తా, ఆగస్టు 30: జనగామ యూత్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమన్నది. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభిగౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు లొక్కుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా మంత్రులు సీతక్క, పొన్న ప్రభాకర్ చిత్రపటాలతో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీని ప్రత్యర్థి వర్గ నాయకులు చింపివేశారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై అభిగౌడ్, ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చామలకు వస్తున్న ప్రజాదరణను చూసి ప్రత్యర్థివర్గం నాయకులు తట్టుకోలేక ఫ్లెక్సీలను చింపుతున్నారని తెలిపారు. గతంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా తాము ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఇదేవిధంగా ప్రత్యర్థివర్గం నాయకులు చింపినట్టు పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఘటనపై జనగామ అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యర్థి వర్గం నాయకులపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.