జనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: జనగామ అర్బన్ ఎస్సై దంపతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ అర్బన్ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ భార్య స్వరూపతో కలిసి పట్టణ కేంద్రంలోని వెంకన్నకుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. కొడుకులిద్దరూ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉంట్నురు. బుధవారం రాత్రి కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన విషయాల్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన స్వరూప గురువారం తెల్లవారుజామున బాత్రూమ్లో చీరతో ఉరేసుకొన్నది.
భర్త తీవ్ర ఉద్వేగానికిగురై.. తనను పరామర్శించడానికి వచ్చిన స్థానికులు, పోలీసులు ఘటనా స్థలంలో ఉండగానే ఉదయం 10.15 గంటలకు బాత్రూమ్కు వెళ్లొస్తానని తన సర్వీస్ రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొన్నది. వీరి మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. వీరి ఆత్మహత్యపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ పేర్కొన్నారు.