హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘నీళ్లు వస్తే ఇంటి ముందట కూలోడు దొరకడు. జీతగాడు దొరకడు’ అని నల్లగొండ ప్రజలకు నీళ్లు రాకుండా గత పాలకులు 200 ఏండ్లు ఆపగలిగిండ్రు. కానీ, కేసీఆర్ పోరుయాత్రతో ఫ్లోరైడ్ బాధితులకు బాసటగా నిలిచి, గల్లీ నుంచి ఢిల్లీదాకా పోరాటం చేసిండ్రు. తెలంగాణ సాధించినంక మొట్టమొదట ఫ్లోరైడ్ ప్రభావిత మునుగోడు నియోజకవర్గం నుంచే మిషన్ భగీరథ అనే మహత్తర పథకానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇప్పుడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీళ్లు అందిస్తుండ్రు. దేనికోసమైతే నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమించామో అది నేడు సాకారమవుతున్నదని జలసాధన సమితి నాయకుడు, నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ ఉద్యమాన్ని నడిపిన దుశర్ల సత్యనారాయణ అంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న ఇంజినీర్లు నల్లగొండ జిల్లాకు చుక్క నీళ్లు రావన్నరు. కృష్ణానది నీళ్లు నల్లగొండ జిల్లాకు రావటం మిథ్య అన్నరు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి..‘నేను బతికుండగా మీకు నీళ్లు రావు.. కాల్వలు రావు’ అన్నడు. కానీ, సీఎం కేసీఆర్ ప్రత్యే తెలంగాణ రాష్ట్రమే సాధించి.. లక్షల ఎకరాలకు సాగు నీళ్లు పారించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ర్టాభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉన్న టీఆర్ఎస్కే మద్దతివ్వాలని మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ఉపఎన్నికతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని భావిస్తున్నారా?
నల్లగొండ జిల్లా ప్రజలం చైతన్యవంతులమని అనుకుంటం. అభివృద్ధికి మాత్రం ఈ చైతన్యం పనిచేయలే. ఇందులో గుండు సున్నా, నిండు సున్నా. అందుకనే 1996 ఎన్నికలో అత్యధిక నామినేషన్లు దాఖలు చేసినం. కలెక్టర్ దగ్గరి నుంచి రాష్ట్రపతి దాకా అందరికీ నోటీసులు ఇచ్చినం. మొదటి నుంచి మేం అపోజిషన్ వాళ్లను గెలిపిస్తా వచ్చినం. పవర్ల కూర్చునేవాళ్లను ఎన్నడూ గెలిపియ్యలే. అందుకే మేం చెడిపోయినం. మేం గెలిపించిన ప్రతిపక్ష పార్టీల వాళ్లు ఎన్నడూ అభివృద్ధి కోసం పనిచేయలే. వాళ్ల మాటలు ఎవరూ వినరు. రీజినల్ పార్టీల కోసం తహతహలాడినం. కేసీఆర్ పుణ్యాన మా తపస్సు ఫలించింది.
మునుగోడులో పోటీ ఎవరి మధ్య ఉంటుందని భావిస్తున్నారు?
సాధారణంగా అధికార పక్షానికి, ప్రతిపక్ష పార్టీకి మధ్యలోనే పోటీ ఉంటది. మునుగోడులో కూడా పోటీ టీఆర్ఎస్కు, కాంగ్రెస్ మధ్యనే ఉంటదని అనుకుంటున్న. తెలంగాణ ఉద్యమం లేదని చెప్పేటందుకు 2006 కరీంనగర్ ఉపఎన్నికలో కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు నాడు సమైక్య పాలకులు ప్రయత్నించారు. ఇప్పుడు మునుగోడులో కూడా అలాంటి పరిస్థితులనే సృష్టిస్తున్నట్టు అనిపిస్తున్నది. నేను అప్పుడు కేసీఆర్‌కే ఓటేయాలని చెప్పిన.. ఇప్పుడు కూ డా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే ఓటెయ్యాలని చెప్తున్న. అట్లయితేనే తెలివిగల్ల పని చేసినట్టు.
అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు.. మరి మీరేమంటరు?
మనం ప్రతిపక్ష లీడర్‌కు ఓటేసి కేసీఆర్‌ను చేయమంటే ఎట్ల చేస్తరు? తెలివి ఉండాలె. రేపు పొద్దున మల్లా చేయలన్నా కూడా కేసీఆరే చేయాలె. రాష్ట్రంల చేసే ది కేసీఆరే. బీజేపోళ్లు రాష్ట్రంల అధికారంల లేరు.
జగోపాల్‌రెడ్డి అభివృద్ధి కోస మే రాజీనామా చేస్తే.. బీజేపీల ఎందుకు చేరిండు?
కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదు.. మునుగోడులో గెలిస్తే అన్నీ చేసిచూపిస్తం అని బీజేపీ అంటున్నది. మీరేమంటరు? మిషన్ భగీరథ మనది.. మిషన్ కాకతీయ మనది.. వాటర్ గ్రిడ్మనది. 24 గంటల కరెంటు మనది. రెండు మూడేండ్లలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తవుతుంది. కేసీఆర్ కాళేశ్వరం కట్టలేదా? కేసీఆర్ కాబట్టే కాళేశ్వరం నీళ్లు వచ్చినయ్. పాలమూరు జిల్లాల నీళ్లు వచ్చే ప్రయత్నం జేసిండు. ఇయ్యాల రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. ఇది కండ్లముందు కనపడుతున్నది కదా. అబద్ధమా ఇది? రాష్ట్రంలో 68 లక్షల మందికి రైతుబంధు వస్తున్నది. నా మనసుల ఉన్న ప్రతీ అంశం కేసీఆర్ చేస్తున్నడు. అవతలోడు 60 ఏండ్ల దాక ప్రాజెక్టులు కట్టుకుంటనే ఉన్నడు.‘చూసుకోను మురువ.. చెప్పుకోను ఏడ్వ’ అన్నట్టు తయారుచేసిండ్రు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంశాల స్వామిని తీసుకెళ్లి మీరు ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించాలని కోరిన వెంటనే ఆయన ఈ సమస్యను పరిష్కరించారని బీజేపీ ప్రచారం చేస్తుంది? నిజమేనా?
బీజేపీ వాళ్లు చెప్పేది పచ్చి అబద్ధం. వారిది అవకాశ వాదం. ఈ మాట అంటే వాజ్‌పేయి ఆత్మకూడా క్షమించదు. కాకపోతే వాజ్‌పేయి సమస్యను విన్నాడు. అంశాల స్వామిలాంటి వాళ్ల బాధను విన్నప్పుడు వాజ్‌పేయి కండ్ల నీళ్లు పెట్టుకున్నడు. వాజ్‌పేయి అట్లనే ఉంటే చేసునో ఏమో. కానీ, ఆ తరువాత అధికారం పోయింది. ఇప్పుడున్న బీజేపీకి అప్పటి బీజేపీకి పోలిక ఉన్నదా అసలు. అప్పటి బీజేపీ మనుషుల మాట వినేది. ఇప్పుడున్న బీజేపీ మనీని మాత్రమే చూస్తున్నది.
ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించింది ఎవరు?
నల్లగొండ నీళ్ల గోస తీర్చేందుకు దారి వేసినం. ఫ్లోరైడ్ పరిష్కారానికి రూట్‌మ్యాప్ కావాలని కలలుగన్నం. హండ్రెడ్ పర్సెంట్ చెప్తా పక్కాగా కేసీఆరే చేసిండు అని. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ నాన్‌స్టాప్ కమిట్మెంట్తో పనిచేస్తున్నడు. ఇది వాస్తవం. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది ఎవరో? నల్లగొండకు ఎరుకే. కేసీఆర్ ఇంటింటికీ నల్లా పెట్టిండు. నీళ్లు ఇస్తున్నడు. ఇది కండ్ల ముందట కనిపిస్తున్నది. దీన్నెవరు కాదంటరు? మనల్ని కాపీ కొట్టి (మిషన్ భగీరథను) కేంద్రం జలశక్తి మిషన్ తెచ్చింది వాస్తవం కాదా?. నిజాన్ని నిర్భయంగా చెప్పాలె. అదే చెప్తున్న. కేసీఆర్ వల్లనే రాష్ట్రం బాగుపడ్దది. రేపు భవిష్యత్తుల ఆయనతోనే బాగుపడ్తది. వేరేవాళ్లకు ఆ స్పృహ లేదు.
నల్లగొండ బిడ్డగా మునుగోడు ప్రజలకు ఏం చెప్తరు?
జనం ఎడ్డివాళ్లు అని పార్టీలు ఎవనికి పడితే వానికి కండువా కప్పి ఖతం అయిపోయిందని అనుకున్నయ్. ఎలక్షన్లప్పుడు ఏమీ ఇవ్వొద్దూ అని చెప్పి ఓట్లు వేయండి. ఇయ్యాల చేయి చాపితే ఐదేండ్ల పాటు మనను బిచ్చగాళ్లలెక్క..బానిసల లెక్క చూస్తరు. న్యాయంగా ఉందాం. ధర్మం వైపు ఉందాం. పనిచేసేటోడు ఎవడు? చేయనోడు ఎవడు? అని ఆలోచించుకోవాలె. మనం నమ్మి ఓటేసినోడు పారిపోతే గల్లాపట్టి అడిగే దమ్ముండాలె. నిజం చెప్పటానికి ధైర్యం ఉండాలె. గ్రాస్పింగ్ చేయటానికి కూడా ధైర్యం ఉండాలె. మనకా పవర్ ఉండాలె. క్యాలిబర్ క్యాపబులిటి ఉండాలె.