సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 20:54:40

‘మిషన్‌ భగీరథ’పై జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం ప్రశంసల వర్షం

‘మిషన్‌ భగీరథ’పై జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం ప్రశంసల వర్షం

హైదరాబాద్ : రాష్ట్రంలో  జల్‌ జీవన్‌ మిషన్‌ బృందం పర్యటన ఇవాళ్టితో ముగిసింది. ఈ బృందం మూడు రోజులపాటు సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, ఎల్లూరు, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటించి మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అమలు, ఆవాసాలను పరిశీలించింది. ఇవాళ ఉదయం ఎర్రమంజిల్‌లోని భగీరథ కార్యాలయంలో ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా తమ పర్యటన విశేషాలను బృందం ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్‌, చీఫ్‌ ఇంజినీర్లు విజయ్‌ ప్రకాశ్‌, వినోభాదేవి, చెన్నారెడ్డి, చక్రవర్తి శ్రీనివాస్‌రెడ్డి, కన్సల్టెంట్‌ నర్సింగ్‌ రావుతో పంచుకున్నారు.

రాష్ట్రంలో ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందుతున్నదని జల్‌ జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ పథకం తెలంగాణలో తాగునీటికి కష్టాలు తీర్చిందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుతుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన కారణంగానే శుద్ధమైన తాగునీరు ప్రజల ధరి చేరుతున్నదని అన్నారు.  జల్‌ జీవన్‌ మిషన్‌ కంటే ముందే తెలంగాణలో ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన నీళ్లు అందుతుండటం గర్వకారణమని అన్నారు. 

తక్కువ కాలంలో ప్రతిష్టాత్మక పథకాన్ని పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఉపరితల నీటి వనరులను మిషన్‌ భగీరథకు వినియోగించడం గొప్ప నిర్ణయమని కితాబు నిచ్చారు. భూగర్భ జలాలు ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. మిషన్‌ భగీరథ పథకంతో ప్రజలు ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు మిషన్‌ భగీరథ నీరు సరఫరాతో విద్యార్థులకు ఆరోగ్య భద్రత లభిస్తున్నదన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.