రవీంద్రభారతి, అక్టోబర్ 18: తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా రెడ్ల పార్టీగా మిగిలిపోయిందని, బీసీ ద్రోహిగా మారిన ఆ పార్టీని బీసీలు ఏకమై బొందపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్వేల పేరుతో టికెట్లు అమ్ముకొని మొండిచేయి చూపించారని విమర్శించారు. బుధవారం ఆయన హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో కాంగ్రెస్‌కు బలంలేని ఓడిపోయే స్థానాలను బీసీలకు కేటాయించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇదే వైఖరి కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. మిగతా సీట్లలో బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సీట్ల చొప్పున ఇవ్వకపోతే కాంగ్రెస్ బీసీ ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని చెప్పారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, సదానందం, శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్ మేరు, మల్లికార్జున్‌యాదవ్, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.