హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బీసీ ఉపాధ్యాయ సంఘం(బీసీటీయూ) రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ఉపాధ్యాయ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు. బీసీ ఉద్యోగులకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కుతుందని తెలిపారు.
పెం డింగ్‌లో ఉన్న ఆరు డీఏలను రాష్ట్ర ప్రభు త్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగుల హక్కుల కోసం మార్చి రెండో వారంలో హైదరాబాద్‌లో వేలాది మందితో బీసీ ఉపాధ్యాయుల రాష్ట్ర మహసభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందని వెల్లడించారు. బీసీ ఉపాధ్యాయ సంఘం బాధ్యుడిగా కొన్నే శంకర్‌గౌడ్, రాఘవాపురం గోపాలకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీసీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శంకర్, వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.