హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణనతో బీసీ కులాలు, ఉప కులాలన్నింటికీ పథకాల్లో న్యాయం దక్కుతుందని రాజ్యసభసభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆకాంక్షించారు. ఆయన మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బీసీ కులగణన నిర్ణయం హర్షణీయమని తెలిపారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. అంతకుముందు సీఎం తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్‌ను విడుదల చేశారు. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, స్టార్ హాస్పిటల్స్ ఎండీ మన్నెం గోపీచంద్, జేఎండీ డాక్టర్ గూడపాటి రమేశ్, బార్ కౌన్సిల్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్‌లో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.