హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన, హామీల అమలులో వైఫల్యాలు, రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌తో విస్తృతంగా చర్చించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు నాగేందర్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను మరింత క్రియాశీలంగా ప్రజల గొంతుకగా మార్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్‌తో నాగేందర్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, బీఆర్ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆస్ట్రేలియా బీఆర్ఎస్ చేపట్టనున్న కార్యాచరణపై వీరి మధ్య చర్చ జరిగింది.

ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ కార్యకలాపాల విస్తరణ, పార్టీ కార్యక్రమాలకు ఎన్నారైల మద్దతును మరింత సమీకరించడం, తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న సామాజిక, రాజకీయ కార్యక్రమాలపై కూడా ఇరువురు చర్చించారు. అదేవిధంగా కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపైనా కేటీఆర్, నాగేందర్ రెడ్డి మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో కాసర్ల నాగేందర్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను కేటీఆర్ అభినందించారు. పార్టీ కోసం ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోనూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి బీఆర్ఎస్ వాణిని బలంగా వినిపిస్తామని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.