హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : కొలనుపాకలోని ప్రసిద్ధ జైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న జైనశిల్ప సంగ్రహాలయంలో వందలోపు శిల్పాలు, శాసనాలు ఉన్నాయని, ఇవి ఎంతో అపురూపమైనవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. వీటిలో జైనముఖి స్తంభాలు, జైన స్తూప ప్రతిమ, యక్షిణులు, గురువులు, తీర్థంకరులు, బాహుబలి విగ్రహాలు ముఖ్యమైనవని పేర్కొన్నది.
సంగ్రహాలయం బయట కనిపించిన ఓ రాతిస్తంభంపై జైన మహావీరుడు, వ్యాస పీఠానికి ఎదురుగా వ్యాఖ్యాన ముద్రలో కూర్చున్న జైన గురువు ప్రతిమలు ఉన్నాయని, శాసనాల్లోని లిపిని బట్టి ఇవి కల్యాణి చాళుక్యుల కాలం (10,11వ శతాబ్దాలు) నాటివని తెలుస్తున్నదని బృందం సభ్యులు వెల్లడించారు. ఇలాంటి శిల్పాలు హన్మకొండ పద్మాక్షిగుట్టతోపాటు రాయచూరులో ఉన్నాయని, అప్పట్లో విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందించినట్టు శాసనాలు, జైన సాహిత్యం ద్వారా తెలుస్తున్నదని, శాసనాల ద్వారా లభించిన ఆధారంగా కొలనుపాక కూడా జైన విద్యాకేంద్రం అయ్యుండొచ్చని వారు అభిప్రాయపడ్డారు.