Gurukula Schools | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకుల సొసైటీలన్నింటికీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిన పనివేళలు జైలు మాన్యువల్ కన్నా దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో ఖైదీలకు వర్తింపజేసేట్టు విద్యార్థులకు టైం టేబుల్ అమలు చేయటంపై అసహనం వ్యక్తం అవుతున్నది. ఉదయం 5 గంటలకే నిద్రలేపి.. రాత్రి 9 గంటల వరకు విశ్రాంతి లేకుండా, వ్యక్తిగత సమయం ఇవ్వకుండా చేయటంతో విద్యార్థులు అలసిపోతున్నారు. దాంతో తరగతి గదుల్లో క్లాసులు జరుగుతుండగానే నిద్ర వచ్చేస్తున్నది. అటు పాఠాలు కూడా బుర్రకు ఎక్కడం లేదు. ప్రభుత్వం మార్చిన పనివేళలతో విద్యార్థులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. టైం టేబుల్ అమలు ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అనేక గురుకులాలు ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయని, అందులో బాత్రూంలు, నీళ్లు, వంటగది తదితర వసతులు సరిపడా లేవని, బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయ్యే వరకు విద్యార్థులను పరిగడుపున తరగతి గదిలో కూర్చొబెట్టి క్లాస్ చెప్పాల్సి వస్తున్నదని, తిరిగి క్లాస్ మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కి పంపాల్సిన పరిస్థితి నెలకొన్నదని వివరిస్తున్నారు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై, మానసిక స్థితిపై దెబ్బ పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం ఈ పనివేళల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
గురుకుల పాఠశాలల పనివేళలు విద్యార్థుల మానసిక వికాసానికి తగిన విధంగా ఉండాలని, టీచర్లు ఒత్తిడి లేకుండా పనిచేసేలా శాస్త్రీయంగా నిర్ణయించాలని టీఎస్‌యూటీఎఫ్ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ‘గురుకులాల పనివేళలు-విద్యార్థులపై ప్రభావం’ అంశంపై తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో వక్త లు మాట్లాడుతూ విద్యార్థులకు అనుగుణంగా పనివేళలను సవరించాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి లక్ష్మిరెడ్డి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.