జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ శివారులోని అల్గోల్ ఫారెస్ట్‌లో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. అడ్డా కూలీ అయిన రుక్కమ్మ అనే మహిళను తోటి అడ్డా కూలీయే హత్యచేశాడని తేల్చారు. శుక్రవారం ఉదయం బీదర్‌కు పారిపోతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ పట్టణ సీఐ తోట భూపతి శుక్రవారం సాయంత్రం జహీరాబాద్ పట్టణ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్ గ్రామానికి చెందిన రుక్కమ్మ ప్రతిరోజు అడ్డా కూలికి వెళుతుంది. గురువారం ఉదయం కూలీ పని దొరకకపోవడంతో తిరిగి రంజోల్కు వెళుతుండగా మార్గమధ్యలో భరత్‌నగర్‌కు చెందిన అడ్డా కూలీ మహమ్మద్ ఖదీర్ ఎదురయ్యాడు. ఇద్దరు కలిసి పస్తాపూర్ చౌరస్తా దగ్గర మద్యం, బిర్యానీ తీసుకుని సైకిల్ మోటార్‌పై అల్గోల్ ఫారెస్ట్‌లోకి వెళ్లారు. అక్కడి మద్యం సేవించి, బిర్యానీ తిన్న తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఖదీర్ రుక్కమ్మ మెడకు ఆమె చీరకొంగుతోనే ఉరిబిగించి హత్య చేశాడు.
హత్య అనంతరం ఖదీర్ కర్ణాటకలోని బీదర్‌కు పారిపోయాడు. శుక్రవారం ఉదయం మళ్లీ జహారాబాద్కు వచ్చి బీదర్‌కు వెళ్తుండగా పాత ఆర్టీవో చెక్ పోస్ట్ దగ్గర ఖదీర్‌ను అరెస్టు చేశారు. 24 గంటల్లో కేసును సేదించిన పట్టణ ఎస్సై శ్రీకాంత్‌ను సీఐ అభినందించారు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితుడి నుంచి సైకిల్ మోటార్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.