జగిత్యాల రూరల్, ఆగస్టు 18 : బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మహారాష్ట్ర వరదల్లో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. భారీ వరదలకు కారుతో సహా కొట్టుకుపోగా, డ్రైవర్‌తోపాటు మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామనగర్‌లో ఉండే ఆఫ్రీన్, సమీనా, హసీనా, సమీనా మేనల్లుడు షోయబ్ కలిసి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా ఉద్గిర్ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో పెండ్లికి బస్సులో వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు కారు కిరాయికి మాట్లాడుకొని రాత్రి సమయంలో బయలుదేరారు.
గడిచిన మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో పడుతున్న భారీ వర్షాలకు రోడ్లపై వరద ఉప్పొంగుతుండగా, నాందేడ్ జిల్లా దెగ్లూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కారు వరదల్లో చిక్కుకున్నది. నాలుగు వైపులా వరద ఉధృతంగా రావడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో షోయబ్తోపాటు డ్రైవర్ చాకచాక్యంగా బయట పడగా, ముగ్గురు మహిళలు కారుతోసహా కొట్టుకుపోయారు. ప్రమాదం నుంచి బయటపడిన షోయబ్ ఇచ్చిన సమాచారం మేరకు జగిత్యాలలోని కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఆఫ్రీన్ తన భర్త అబ్దుల్పాషాకు ఫోన్ చేసింది. ‘మేం వరదలో చిక్కుకున్నం. కారులోకి వరద వచ్చింది. మమ్మల్ని ఎవరైనా కాపాడితే బతుకుతం. లేకపోతే మేం బతికే పరిస్థితిలో లేం. పిల్లలు జాగ్రత్త’ అంటూ రోదించింది. కాసేపటికే ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. బంధువులు ఫోన్ చేస్తే ఆఫ్రీన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందారు. రాత్రికి రాత్రే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గల్లంతైన మహిళల కోసం వెతికారు. సాయంత్రానికి గల్లంతైన ప్రదేశానికి కొద్ది దూరంలో కారు కనిపించింది. కానీ, మహిళళ ఆచూకీ దొరకలేదు.