జగిత్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): ‘నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. పార్టీ అసెంబ్లీలో ఏదైనా అంశంపై విప్ జారీచేస్తే దానికి కట్టుబడి ఉంటా. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నా’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్‌కుమార్ మరోసారి వ్యాఖ్యానించారు. బుధవారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైన తాను జగిత్యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ఉదయం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడిన గంటన్నర వ్యవధిలోనే.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ మారినట్టు సరైన సాక్ష్యాలు లేవంటూ స్పీకర్ రూలింగ్ వెలువరించారు. ఈ నేపథ్యంలో ప్రజలను, రాజ్యాంగ నిపుణులను, చట్టబద్ధ సంస్థలన్నింటినీ తప్పుదోవ పట్టించేందుకే సంజయ్‌కుమార్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అంటూ వ్యాఖ్యానించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధిక కాంగ్రెస్ సీట్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తన వర్గానికి సీట్లు కేటాయించుకున్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గమైన జీవన్‌రెడ్డి అనుచరులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. ఇదే అంశంపై మంగళవారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు అంశంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ తాజాగా బుధవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు జీవన్‌రెడ్డి చురకలు అంటించారు.