జగిత్యాల మున్సిపాలిటీ ఆరేళ్లలో అంతులేని అవినీతి ఆరోపణలకు కేరాఫ్‌గా మారింది. అనేక అవకతవకలు, స్కామ్‌లు, స్కీమ్‌లు.. ఇక్కడ కామన్ అన్నట్టుగా తయారైంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ జరుగుతుండడం, ఏసీబీ అధికారులు దాడులు చేయడం, కొందరు ఉద్యోగులు జైలు పాలు కావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పదిహేను మంది కమిషనర్లు బదిలీ కావడం, ఇక్కడ ఉండలేమంటూ ఇతర చోట్లకు వెళ్లిపోవడం.. ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. అయితే, అందుకు నాయకుల మధ్య విబేధాలు, పొలిటికల్ ప్రెషరే కారణమని తెలుస్తున్నది. ‘పట్టుమంటే కప్పకు.. వదలమంటే పాముకు కోపం’ అన్నట్టు వ్యవహారం తయారు కావడంతో ప్రెషర్ తట్టుకోలేకే చాలా మంది కమిషనర్లు బదిలీపై వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ కారణాలతోనే మున్సిపాలిటీలో ఇవాళ్టి వరకు పరిపాలన దారికి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటీవలే కొత్తగా వచ్చిన కమిషనర్ హయాంలోనైనా పాలన గాడిన పడేనా..? అనే చర్చ జరుగుతున్నది.
జగిత్యాల, మే 13 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల మున్సిపాలిటీ ఆరేండ్ల వ్యవధిలో అనేక అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ తనిఖీలు, ఏసీబీ దాడులు, సీడీఎంఏ విచారణలకు నిలయమైంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ జరుగుతూనే ఉన్నది. 2020లో కొత్త పాలకవర్గం కొలువుదీరిన కొద్ది రోజులకే ఏసీబీ అధికారులు మున్సిపాలిటీపై దాడి చేసి, లంచం తీసుకుంటున్న అధికారులు, సివిల్ వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం సంచలనం సృష్టించింది. తర్వాత విజిలెన్స్ అధికారులు మున్సిపాలిటీలో విచారణ నిర్వహించారు. ఆరేళ్లలో సీడీఎంఏ శాఖ అధికారులు మూడు నాలుగుసార్లు తనిఖీ చేశారు. ఇంటి నెంబర్ల కేటాయింపుల నుంచి మొదలుకొని అనేక అంశాల్లో అవినీతి తీవ్ర చర్చనీయాంశం కాగా, వీఎల్టీ ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగితోపాటు మున్సిపల్ కమిషనర్ సైతం జైలుకు వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరేళ్ల వ్యవధిలో ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగులు జైలుపాలయ్యారు. గత నెలలో సైతం మున్సిపాలిటీ నుంచి కేటాయించిన తప్పుడు ఇంటి నంబర్‌తో జరిగిన భూ రిజిస్ట్రేషన్ బయటకు రావడంతో ఏసీబీ అధికారులు 14 గంటల పాటు తనిఖీ చేశారు. అనేక అవకతవకలు జరిగినట్లు తాము ప్రాథమికంగా అంచనాకు వచ్చామని చెప్పారు. మున్సిపాలిటీకి చెందిన డీజిల్ బిల్లుల్లో లక్షలాది రూపాయల స్కామ్ జరిగిందన్న ఆరోపణలు గత రెండేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మున్సిపాలిటీకి చెందిన రెండు ట్రాక్టర్లు, నాలుగు ఆటోలు కనిపించకుండా పోయాయని పేర్కొనడం మరో సంచలనమైంది. కార్మికులకు సంబంధించిన వేతనాల చెల్లింపుల విషయంలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని అడ్వైర్టెజ్ బోర్డులకు పన్ను వసూలు చేయడంలో స్కామ్ జరిగిందని, అలాగే కమర్షియల్, ప్రైవేట్ దవాఖానల భవనాల కొలతల విషయంలోనూ అధికారులు అవినీతికి పాల్పడి మున్సిపల్ అదాయానికి గండి కొట్టారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆరేండ్ల కాలంలో దాదాపు 15 మంది వరకు కమిషనర్లు బదిలీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలా వరకు నెల, రెండు నెలలు మాత్రమే పనిచేసి కమిషనర్లు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయింది. అయితే, ఇంతమంది బదిలీకి బల్దియాలో నెలకొన్న సమస్యలు, నాయకుల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం, పొలిటికల్ ప్రెషర్ కారణమని తెలుస్తున్నది. అందుకే మున్సిపాలిటీలో ఇవాళ్టి వరకు అస్తవ్యస్త పరిపాలన దారికి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక లోపాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు, అలాగే లేబర్‌కు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఇంత వరకు అమలు చేసిన పాపాన పోవడం లేదు. ఇక మున్సిపాలిటీకి ఉన్న ఆటోలు, త్రిచక్ర వాహనాలు, తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, బ్లేడ్ ట్రాక్టర్లకు కనీసం జియో ట్రాకింగ్ ఏర్పాటు చేయలేదు. జియో ట్రాకింగ్ లేకపోవడం వల్లే పలు వాహనాలు కనిపించకుండా పోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మున్సిపాలిటీ తన ఆస్తులను రక్షించుకునే విషయంలోనూ సరైన దిశగా ప్రయాణం చేయడం లేదన్న విమర్శలున్నాయి. జగిత్యాలలోని కొత్త బస్టాండ్ సమీపంలోని కోట్లాది రూపాయల విలువ చేసే మున్సిపల్ స్థల వివాదం తీవ్ర ప్రకంపనలను సృష్టించింది. 2008లోనే టైటిల్ డీడ్ కోసం మున్సిపాలిటీ సరైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆదేశించినా, ఇంత వరకు మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గాలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పట్టణంలో మున్సిపాలిటీకి ఉన్న దుకాణ సముదాయాలన్నీ రాజకీయ నాయకుల అనుచరుల చేతుల్లో కబ్జాకు గురయ్యాయని, వారు నామమాత్రం ఫీజును మున్సిపాలిటీకి చెల్లించి, లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, యావర్ విస్తరణ అనే ప్రధాన సమస్య మున్సిపల్‌ను పట్టిపీడిస్తూనే ఉంది.
మున్సిపాలిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు ప్రధాన కారణం ఆరేళ్ల్లుగా పాలకవర్గంలోని సభ్యుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బల్దియాలో రాజకీయ నాయకుల జోక్యం పెరగడం, ప్రజాప్రతినిధుల మధ్య పొరపెచ్చులు రావడం, దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకోవడం, ఒకరు ప్రతిపాదించిన పనిని మరొకరు అడ్డుకోవడం వంటి కారణాలు అధికారులను ఇబ్బందులకు గురిచేశాయి. ప్రస్తుతం 50 మంది కౌన్సిలర్లు ఉన్న జగిత్యాల పాలకవర్గంలో 30 మంది తొలిసారి కౌన్సిలర్లుగా ఎంపికైన వారే కాగా, కొత్తవారు రూల్స్‌ను సరిగా పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్ ఎజెండా కాపీని, సాధారణ సమావేశానికి చెందిన ఎజెండాను ఇవ్వడంలో నిబంధనలు పాటించడం లేదని, అలాగే ఎజెండాను మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్ ముద్రించారని సభ్యుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇక పాలకవర్గం అత్యంత సంక్లిష్టంగా తయారైంది. కాంగ్రెస్ 14 వార్డులు, ఇండిపెండెంట్లు 15 వార్డులు గెలుచుకోగా.. ఇండిపెండెట్ల సహాయంతో కాంగ్రెస్ పాలకవర్గాన్ని కైవసం చేసుకున్నది. అయితే, అందులో జీవన్‌రెడ్డి, సంజయ్‌కుమార్ వర్గీయులుగా సభ్యులు చీలిపోయి ఉన్నారు. ఇటీవలే జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన నేపథ్యంలో ఏ కౌన్సిలర్ ఎవరివైపు ఉన్నాడు? సభ్యుడి పరిస్థితి ఏంటి? అన్న విషయంలో సంక్లిష్టత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ఏ చర్య తీసుకున్నా ఇబ్బందికర పరిస్థితి వచ్చేలా ఉన్నది. మున్సిపాలిటీలోని సమస్యలను ఏకరువు పెడితే వేలాదిగా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల క్రితం జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్ -1 సర్వీస్ నుంచి ఎంపికైన సత్య ప్రణవ్ బాధ్యతలు తీసుకున్నారు. అనేక అవినీతి ఆరోపణలు, సమస్యలకు కేరాఫ్‌గా మారిన మున్సిపాలిటీని కొత్త కమిషనర్ అయినా, గాడిలో పెడుతారా..? అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది.