హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖ మతపరమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత సంవత్సరం నవంబర్‌లో ఆలయాలవారీగా ప్రకటనలు ఇచ్చింది. ఆయా దేవాలయాల్లో ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల నియామకానికి కార్యనిర్వహణాధికారులు అప్పట్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. అర్చక, పరిచారక తదితర పోస్టులకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఈ పోస్టులకు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అభ్యర్థులు చెప్తున్నారు. ఇప్పటికే ఎంపికలు కూడా పూర్తయ్యాయని కేవలం నామమాత్రంగా రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్ప ముడుపులు ముట్టజెప్పిన అభ్యర్థుల ఎంపికలు కూడా దేవాలయాల అధికారులు పూర్తి చేశారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాదగిరిగుట్ట, బల్కంపేట, మహంకాళి, వేములవాడ తదితర దేవాలయాల్లో ఆయా ఆలయాల ఆగమానుసారం అర్చక, పరిచారక పోస్టులను భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ చేపట్టారు. హైదరాబాద్‌లోని ఓ అమ్మవారి ప్రముఖ ఆలయంలో అర్చక పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెట్టి ఆ పోస్టు అవసరమా? అంటే ఆ దేవాలయంలో అర్చకుడికి అంత డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు.
పరిచారక పోస్టులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని, స్థానిక అధికారులను ప్రసన్నం చేసుకొని, ముందుగా సగం చెల్లించి, నియామక ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో మిగిలిన మొత్తం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది. ఇదంతా జనవరి నుంచే జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలాఉంటే ఒక ప్రధాన ఆలయంలో పెద్ద ఎత్తున పోస్టులు భర్తీచేస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకొంటున్నారని, వారు డిమాండ్ చేసినంత సమర్పించినవారికి పోస్టులు దాదాపు ఖరారైనట్టు చెప్పుకొంటున్నారు. పోస్టులు భర్తీ చేయనున్న ప్రతి ఆలయంలో లోపాయికారీ ఒప్పందాలు కుదరడం, హైదరాబాద్ నగరంలోని ఒక అమ్మవారి ఆలయంలో వేదపండితుడి తమ్ముడి నుంచి ముందస్తుగానే రూ.రెండు లక్షలు తీసుకొని అర్చక పోస్టు ఇస్తానని చెప్పిన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఒకరు.. చివరకు అతనికి కాల్‌లెటర్ కూడా పంపలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అదే దేవాలయంలో పరిచారక పోస్టుకు మరో అభ్యర్థి నుంచి అడ్వాన్స్‌గా రూ.50 వేలు తీసుకున్నప్పటికీ, అతనికి కూడా కాల్‌లెటర్ పంపలేదని తెలుస్తున్నది. దీంతో వారిద్దరూ కమిషనర్‌ను కలుస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటికే ఇదే దేవాలయంలో వేరే వారితో ఒప్పందం కుదుర్చుకొని వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆ కార్యనిర్వహణాధికారి డబ్బులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు జిల్లాల్లోని ఆలయాల్లో పోస్టుల నియామకంలో కూడా ముడుపుల దందా కొనసాగుతున్నదని అభ్యర్థులు చెప్తున్నారు. ముడుపుల్లో తనకు మాత్రమే కాదని, ప్రధాన కార్యాలయంలోని కొందరు ముఖ్య అధికారులకు కూడా సమర్పించుకోవాలని చెప్పి వారికే లక్షలు ఇస్తే తప్ప పోస్టింగ్‌లు కష్టమని చెప్పారని అభ్యర్థులు వాపోయారు. తాము దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ అధికారులను కలిస్తే ఎంత పెట్టుకుంటావు? అని అడుగుతున్నారని, ఒకవేళ తాము చేయలేకపోతే ఆ పోస్టు మీకు కష్టమేనంటున్నారని ఒక అభ్యర్థి ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, దీనిపై స్థానిక అధికారులను వివరణ కోరగా, నియామక ప్రక్రియ అంతా ఎగ్జామినర్ల చేతిలో ఉంటుందని చెప్పారు.