సంగారెడ్డి, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ‘నువ్వెంత.. నీ కెపాసిటీ ఎంత.. నన్నే ప్రశ్నిస్తావా.. ఇంతమందిలో నాకు ఎ దురుచెప్తావా? ఫాల్తుగా..’ అంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడిపై ఆవేశంతో ఊగిపోయారు. ఆ నాయకుడిని దుర్భాషలాడుతూ.. పార్టీ సమావేశం నుంచి బలవంతంగా పంపించివేశారు. జగ్గారెడ్డి మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ల ఆశావహులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ముందస్తుగానే సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఆయన ఈ సమావేశంలో ప్రకటించారు. ఇది వివాదానికి దారితీసింది.
ఎస్సీ మినహా ఏ రిజర్వేషన్ వచ్చినా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని స్పష్టంచేశారు. వైస్ చైర్మన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన షఫీ ఉంటారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయిన పక్షంలో పార్టీ నాయకుడు మహేశ్‌లాల్ అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. జగ్గారెడ్డి నిర్ణయంపై అక్కడే ఉన్న దళిత నాయకుడు సునీల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పార్టీలో దళిత నాయకులు చాలామంది సీనియర్లు ఉండగా, వా రిని పక్కనపెట్టి జూనియర్ అయిన మహేశ్లాల్కు చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. 40 ఏండ్లుగా కాంగ్రెస్ పా ర్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నానని తమకు పదవులు ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.‘సునీల్.. ఎక్కువ మాట్లాడితే ఇకపై నా దగ్గరికి కూడా రానివ్వను. కౌన్సిలర్ టికెట్ కూడా రాదు’ అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. ‘నీ కెపాసిటీ ఎంత? నాటకాలు చేస్తున్నావా.. అని ఆవేశంగా ఊగిపోయారు. ఆపై సునీల్‌ను బలవంతంగా మీటింగ్ నుంచి బయటకు పంపించేశారు. దీన్ని ఎవ్వరూ వీడియో తీయవద్దని, బయటకు వస్తే వీపులు పగులుతాయని మీడియాను హెచ్చరించారు.
కల్వకుర్తి, జనవరి 7: దాదాపు 45 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర నిందితుడు ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురానికి చెందిన నాగిరెడ్డి జల్సాలకు అలవాటు పడి 18వ ఏట నుంచే దొంగతనాలు చేసేవాడు. 2023లో వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో నాగిరెడ్డిని అరెస్ట్ చేయగా, పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అరెస్ట్ చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించి, విచారణలో భాగంగా తీసుకొస్తుండగా గత నవంబర్ 13న తప్పించుకున్నాడు. దీంతో ముమ్మరంగా గాలించి లింగోజీగూడలో అదుపులోకి తీసుకున్నారు.