Jaggareddy | కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దారిద్య్రం దాపురించిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్కు హాజరయ్యే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై నాలుగేళ్లుగా పార్టీలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో చేసిన తనను ప్రశ్నించడం ఆవేదన గురి చేస్తుందన్నారు. ఇంత బతుకు బతికి కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితులు చూస్తానని ఎన్నడూ అనుకోలేదని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు స్వయంగా రాహుల్ గాంధీ పిలిస్తేనే ఢిల్లీకి వచ్చానని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి సంబంధించి పరిస్థితిలో రాష్ట్రంలో ఎలా ఉన్నాయో కూడా వివరిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రాటజీ సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్లో పొంగిలేటి చేరిక సభ, భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభను ఒకేసారి ఉమ్మడిగా నిర్వహించాలని రేవంత్రెడ్డి వర్గం సూచించిందని, అయితే, దీన్ని భట్టి వర్గం పూర్తిగా వ్యతిరేకించినట్లుగా తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే ఇది చోటు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇప్పటికే పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని సూచిస్తున్న ఢిల్లీ పెద్దలకు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి నెలకొన్నది.