సూర్యాపేట, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలు నుం చి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ గ్యారెంటీల అమలు నుంచి పక్కకు జరగాలని యోచిస్తున్నదని ఆరోపించారు. గురువారం ఆయన సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కలిసి మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మం త్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలు ఉన్నాయనుకున్నామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అనడాన్ని ఆయన తప్పుబట్టారు. కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో, బయట కాంగ్రెస్ నేత లు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన గ్యారెంటీల నుంచి తప్పించుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా ఓపెన్ అని, ఎలాంటి రహస్యాలు ఉండవని పేర్కొన్నారు.