హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ) : సబ్బండ వర్గాలను ఏకం చేసి పోరాడి తెలంగాణ సాధించిన మహానేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచితవ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఖండించారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకే అసహనంతో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది ఆరాధించే నేత కేసీఆర్ చావును కోరుకోవడం బాధాకరమన్నారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి మాట్లాడారు. పవిత్రమైన అసెంబ్లీని కాంగ్రెస్ కౌరవసభలా మార్చిందని విమర్శించారు. దళిత స్పీకర్‌ను అవమానించారనే సాకుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. చట్టసభలు, దళితులంటే బీఆర్ఎస్కు ఎంతో గౌరవమని తెలిపారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టి హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే శాసనసభలో కాంగ్రెస్ కపట నాటకాలకు తెరలేపిందని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంలో పచ్చిఅబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. ప్రతిపక్షాలు లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గొంతునొక్కుతున్నారని ధ్వజమెత్తారు. కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. సీఎం రేవంత్ వెంటనే కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.