హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): యాదాద్రి పవర్ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్తుశాఖమంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. యాదాద్రి పవర్ ప్రాజెక్టును టెండర్ పిలవకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. జగదీశ్‌రెడ్డి పవర్‌ప్లాంట్‌లో సబ్ కాంట్రాక్టర్ అని, మిర్యాలగూడ ఎమ్మెల్యేకు ఇందులో వాటా ఉందని ఆరోపించారు.
నిజానికి విద్యుత్తుపై జగదీశ్‌రెడ్డికి ఏమీ తెలియదని, అంతా సీఎండీ ప్రభాకర్‌రావే నడిపించారని, బీఆర్ఎస్ నేతలకు ఆయన దోచిపెట్టారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తామని, ఎవ్వరినీ వదలబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ సర్కారు ఎన్నడూ 24 గంటల కరెంటు ఇవ్వలేదన్న విషయం సబ్స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే విద్యుత్తు సంస్థ నష్టాల్లో ఉందని విమర్శించారు. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పేటెంట్ అని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
తేల్చకుంటే ఆరోపించిన వారిని శిక్షించాలి
మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలపై జగదీశ్‌రెడ్డి దీటుగా స్పందించారు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో కానీ, లేదంటే కమిషన్‌తో కానీ వెంటనే విచారణ జరిపించాలని కోరారు. న్యాయ విచారణకు సైతం సిద్ధమని సవాలు విసిరారు. విచారణ జరిపించి దోషులెవరో తేల్చాలని, లేకపోతే సభలో అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పనికి మాలిన, అర్థంలేని మాటలని తాను ఇంతకాలం పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు సభలో మాట్లాడటంతో విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.