సూర్యాపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రులకు స్పృహ లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ఓ మంత్రి వాటర్‌లో నీళ్లు కలుపుకొని అని మాట్లాడితే.. మరికొందరు కమీషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించకపోగా ఆయన వ్యాఖ్యలపై పది రోజుల తరువాత స్పందించడం తీరు చూస్తే రాష్ట్ర మంత్రుల తీరుపై అనుమానం కలుగుతుందని అన్నారు.
మంగళవారం జగదీశ్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మా ట్లాడుతూ.. పవన్‌కల్యాన్ వ్యాఖ్యలు చేసి పది రోజులు అవుతుంటే రాష్ట్ర మంత్రులు ఇప్పుడు స్పందించడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని, అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ ఆ నాడే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పవన్‌కల్యాణ్ సినిమాలు ఆపుతామని ఇక్కడి మంత్రి కామెడీగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభిమానం వేరు, రాజకీయం వేరని సూచించారు. పది రోజుల తరువాత స్పందించిన తీరు చూస్తుంటే ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. కండ్ల ఎదుట కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే అప్పుడు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించే విషయంలో ఇప్పుడూ అలసత్వమే ప్రదర్శించారని మంత్రులపై మండిపడ్డారు.