హైదరాబాద్ : మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలుకానుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. వ్యవసాయ ప్రధాన ఎజెండాకే ప్రజలు జై కోడుతున్నారని తేల్చిచెప్పారు. అది ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని ప్రజలు గుర్తించారన్నారు.
దీంతో బెంబేలెత్తిపోతున్న మోదీ, అమిత్ షాల ద్వయం సరికొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 18న ఖమ్మంలో తలపెట్టిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ రైతాంగం ఎజెండాయే బీఆర్ఎస్ ముందున్న కర్తవ్యమన్నారు. అందుకు తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న రైతుబంధు, రైతుభీమా పథకాలే తార్కాణమన్నారు.
ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీల ఏలుబడిలో రైతులకు ఒరిగింది శూన్యమన్నారు. మోదీ మాయాజాలానికి కాలం చెల్లిందన్న ఆయన.. సరికొత్త తరం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావం అని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం సభకు సర్వం సిద్ధమని, ఈ సభకు హాజరయ్యే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల ప్రజానీకానికి అలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.