సూర్యాపేట, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘మా నాయకుడు కేసీఆర్ అనునిత్యం నీ గుండెల్లో మేకులాగా గుచ్చుకుంటుండటంతో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ చెత్తచెత్తగా వాగుతున్నావ్’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా కనీసం వెయ్యి క్షణాలైనా కేసీఆర్ గురించి ఆలోచించకుండా ఉన్నావా? ఆయన గురించి మాట్లాడకుండా ఉన్నావా రేవంత్? అందుకే కేసీఆర్ ఎప్పుడూ నీ గుండెల్లోనే ఉంటారు.
కేసీఆర్ మంచి పనులు చేసినందునే నీ మనసులో ఉన్నారు. ఎటు పోయినా కేసీఆర్ పనులు కనిపిస్తున్నాయి. ఆయన నీ చుట్టే కనిపిస్తున్నరు. కేసీఆర్ పాలన ఉంటే బాగుండే అని ప్రజలు సైతం భావిస్తున్నారు. అందుకే ఫ్రస్ట్రేషన్‌తోనే హీనంగా మాట్లాడుతున్నావ్’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు కాంగ్రెస్‌లో అధికారం కోసం పోటీ పెరిగిందని, అందుకే ఢిల్లీ పర్యటనలు పెరిగిపోతున్నాయని.. దీంతో తనకు రోజులు దగ్గర పడ్డట్టు గ్రహించే ఆ ఫ్రస్ట్రేషన్లో రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్టు చెత్తగా వాగుతున్నాడని మండిపడ్డారు. ‘నిజంగా కేసీఆరే నీ మనసులో లేకుంటే.. నీకు పదేపదే ఎందుకు గుర్తొస్తున్నారు? కేసీఆర్ నీ గుండెల్లో నిద్రపోతున్నారు.
అందుకే ఆయన సైనికులను చూసి నీ లాగులు ఎందుకు తడుస్తున్నాయి? రోతగా ఎందుకు మాట్లాడుతున్నవ్? నీవు రాష్ర్టాన్ని దోచుకొని లక్షల కోట్లు వెనుకేస్తున్నావు.. దానికి కచ్చితంగా జైలుకు పోవడం ఖాయం’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 3న మిర్యాలగూడలో నిర్వహించే రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు.